English | Telugu
ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?.. ఇంకెన్నాళ్లీ సహన పరీక్ష?!
Updated : Aug 25, 2023
ఒకప్పటి సినిమాకు, ఇప్పటి సినిమాకు చాలా తేడా ఉంది. అలాగే ఒకప్పటి ప్రేక్షకులకు, ఇప్పటి ప్రేక్షకులకు చాలా తేడా వుంది. వారి అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. సినిమా ద్వారా ఏది చెప్పినా అది సూటిగా, సుత్తి లేకుండా ఉండాలి. ఇదే సాధారణ ప్రేక్షకుడు కోరుకునేది. భారీ తారాగణం అక్కర్లేదు, ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలో భారీతనం చూపించక్కర్లేదు. సినిమా చూస్తున్న రెండున్నర గంటల సమయం ఇట్టే గడిచిపోయేలా ఉండాలి. తన సమస్యలు మరచిపోయి ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందాలి. వీటన్నింటినీ మించి ఆడియన్స్ పల్స్ ఏమిటి? ఏ తరహా సినిమాలు వారు కోరుకుంటున్నారు? ఎలాంటి సినిమాలైతే ఘన విజయాన్ని అందిస్తారు అనే విషయాల్ని పరిగణనలోకి తీసుకొని కథల ఎంపిక జరగాలి. కానీ, కొన్ని సినిమాలు చూస్తుంటే ప్రేక్షకులతో దర్శకులు ఎలా ఆడుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. అర్థం పర్థంలేని కథలతో, కథనాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈరోజుల్లో థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని కూడా లెక్కచేయకుండా ఒక మంచి సినిమా చూడాలి అని వచ్చే ఆడియన్స్‌తో ఆడుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. దర్శకనిర్మాతలు తమ ధోరణి మార్చుకోకపోతే తెలుగు సినిమా మరింత నష్టపోయే అవకాశం ఉంది. సినిమాయే ప్రాణంగా భావించే కొంత మంది దర్శకులు తెలుగు సినిమా స్థాయిని పెంచి దేశ విదేశాల్లో సైతం అవార్డులు గెలుచుకుంటూ ఉంటే.. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోకుండా తమకు తోచిన విధంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల విలువైన సమయంతో ఆడుకుంటున్నారు. ఈమధ్యకాలంలో ఎంతో ఖర్చుపెట్టి చేసిన సినిమాల ఫలితాలు ఏమయ్యాయో చూస్తునే వున్నాం. దాన్ని గుణపాఠంగా తీసుకొని ఇకనైనా దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తారని ఆశిద్దాం.