English | Telugu
ప్రస్తుతం తెలుగు సినిమాకి అది అవసరమే!
Updated : Aug 26, 2023
ఈ వారం రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా లేదు. గాండీవధారి అర్జున, కింగ్ ఆఫ్ కొత్త, బెదురులంక 2012 ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. ఇందులో కింగ్ ఆఫ్ కొత్త డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో దుల్కర్‌కి వున్న ఫాలోయింగ్ దృష్ట్యా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. రిలీజ్ అయిన మూడు సినిమాల్లో గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏ ప్రత్యేకతా లేని బెదురులంక చిత్రానికి ఫర్వాలేదు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏ సినిమాకీ చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేవు. ప్రమోషన్స్‌తో తమ సినిమాలను పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. వాళ్ళు ఏం చేసినా ఈ ఒక్క వారమే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వచ్చేవారం విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ రాబోతోంది. ఆ సినిమాకి సూపర్‌హిట్ టాక్ వచ్చిందంటే ఈ వారం రిలీజ్ అయిన సినిమాలను పక్కన పెట్టినట్టే. తెలుగు సినిమాలకు ఆగస్టు నెల అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. భోళాశంకర్‌తో సహా అన్ని సినిమాలూ తుస్సుమన్నాయి.
ఇక వచ్చే నెల మొదటి రోజు రిలీజ్‌కి సిద్ధమైన ‘ఖుషి’ ఫలితం ఎలా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ, సమంత, దర్శకుడు శివ నిర్వాణ.. ఈ ముగ్గురూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. వీరికి ఒక సూపర్‌హిట్ ఎంతో అవసరం. అంతే కాదు తెలుగు సినిమాకు ఒక పెద్ద సూపర్‌హిట్ అవసరం ఉంది. ఆగస్టులోనే విడుదలైన తమిళ్ డబ్బింగ్ సినిమా ‘జైలర్’ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇలాంటి సమయంలో తెలుగులో ఒక పెద్ద హిట్ పడితే తెలుగు సినిమా ఊపిరి పీల్చుకుంటుంది. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో ‘ఖుషి’ బ్లాక్‌బస్టర్ మూవీ. మరి విజయ్ దేవరకొండ విషయంలో అది రిపీట్ అవుతుందేమో చూడాలి.