English | Telugu
సినిమా ఫ్లాప్ అయితే వారి పరిస్థితి అధోగతేనా?
Updated : Aug 28, 2023
ఒక సినిమా సూపర్‌హిట్ అవ్వాలి, కలెక్షన్లు కొల్లగొట్టాలి అంటే అది కేవలం భారీ బడ్జెట్ వల్లే అవుతుందనేది వాస్తవం కాదు. తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ కొన్ని రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, ఒక వర్గం దర్శకనిర్మాతల దృష్టి ఎప్పుడూ భారీ బడ్జెట్ మీదే ఉంటుంది. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది? సినిమాని నమ్మి కొనే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారా? అనేది ఆలోచించరు. బడ్జెట్ భారీగా పెట్టినప్పటికీ ఆ సినిమాలో అంత స్టఫ్ ఉందా? అంటే అదీ ఉండదు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తమ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో యూనిట్‌కి ఒక అవగాహన వచ్చేస్తుంది. అయితే దాన్ని ఎక్కడా రివీల్ చెయ్యకుండా తమ సినిమా గురించి ఎక్కువ హైప్ క్రియేట్ చేసి బయ్యర్స్‌కి భారీ రేట్లకు అమ్మేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు, మొదటి షోకే దాని భవిష్యత్తు ఏమిటో తెలిసిపోతుంది. కొన్ని సినిమాలు షేర్ అనే మాటే లేకుండా కనుమరుగైపోతున్నాయి. దీంతో బయ్యర్లు రోడ్డున పడుతున్నారు. కొన్ని సినిమాలు బయ్యర్లను కోలుకోలేని దెబ్బతీశాయి. నష్టపోయిన బయ్యర్లను నిర్మాతలు, హీరోలు ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది చాలా తక్కువ శాతం మాత్రమే. స్వచ్ఛందంగా బయ్యర్ల నష్టాన్ని గుర్తించి వారిని ఆదుకోవడం అనేది జరగదు. ఈ విషయంలో నిర్మాతలపై ఒత్తిడి పెరిగితే తప్ప ముందుకు వచ్చి బయ్యర్లను ఆదుకోరు. ఇటీవల చాలా భారీ సినిమాలకు అలాంటి నష్టమే వచ్చింది. తమకు కోట్లు వచ్చిపడతాయని ఎన్నో హోప్స్ పెట్టుకున్న బయ్యర్స్‌కి పెద్ద షాక్ ఇచ్చిన సినిమాలు ఈమధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ఇకనైనా దర్శకనిర్మాతలు తమ ధోరణి మార్చుకొని బడ్జెట్ విషయంలో, కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే వారూ నష్టపోరు, బయ్యర్లను నష్టపోయేలా చేయరు.