English | Telugu
చిత్ర పరిశ్రమపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి!
Updated : Jul 30, 2024
అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. రాష్ట్రంలో ఏదైనా విపత్తు సంభవించినపుడు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినపుడు సంబంధిత శాఖ కూడా స్పందిస్తుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉంది. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు.
ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్ర పరిశ్రమపై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చెయ్యాని కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన సలహాలను, సూచనలను, అవార్డులపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి చిత్ర పరిశ్రమను కోరారు. కానీ, పరిశ్రమ నుంచి ఎలాంటి సమాధానం లేకపోగా మౌనంగా ఉండడం రేవంత్‌రెడ్డిని బాధించింది. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడం పట్ల ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించామని, దీనిపై సినీ పరిశ్రమలోని పెద్దలు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.