English | Telugu

కష్టపడకుండా కోట్లు సంపాదిస్తున్న తమన్నా.. అదెలా?

2005లో వచ్చిన హిందీ సినిమా ‘చాంద్‌సా రోషన్‌ చెహ్రా’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది తమన్నా భాటియా. ఆ సినిమా భారీ డిజాస్టర్‌ అవ్వడంతో అక్కడ ఆమెకు అవకాశాలు రాలేదు. అదే సంవత్సరం మంచు మనోజ్‌ హీరోగా దశరథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు వరస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అందరు స్టార్‌ హీరోలతో కలిసి నటించి సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. మిల్కీబ్యూటీగా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. తమన్నా తన కెరీర్‌ స్టార్ట్‌ చేసి 20 సంవత్సరాలు పూర్తయింది. టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తూ తన అందాలతో కనువిందు చేసింది. ఇప్పటివరకు దాదాపు 10 సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసింది.

హీరోయిన్‌గా నటిస్తూనే స్పెషల్‌ సాంగ్స్‌పై కూడా దృష్టి పెడుతున్న తమన్నా.. వాటి ద్వారానే ఎక్కువగా డబ్బు సంపాదిస్తోందనే కామెంట్‌ వినిపిస్తోంది. ఐటమ్‌ సాంగ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన తమన్నాను ఒక బాలీవుడ్‌ సిరీస్‌లో బోల్డ్‌గా ఒక సాంగ్‌ చేసేందుకు బుక్‌ చేశారు. తనయుడు ఆర్యన్‌ఖాన్‌ను దర్శకుడిగా నిలబెట్టేందుకు అవసరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడు షారూఖ్‌ ఖాన్‌. ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ సిరీస్‌లో దాదాపు 40 మంది స్టార్స్‌ కేమియో ఇవ్వబోతున్నారు. టాలీవుడ్‌ నుంచి వెంకటేష్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కూడా ఉండడం విశేషం. ఇంతమంది స్టార్స్‌ ఉన్నా.. స్పెషల్‌ సాంగ్‌ కోసం తమన్నాని ఎంపిక చేశారంటే.. ఆమెకు బాలీవుడ్‌లో ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

తమన్నాకి సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ స్పెషల్‌ సాంగ్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి కారణం.. ఎక్కువ కష్టపడకుండా కోట్లు సంపాదించే అవకాశం ఉంటుందని. ఒక సినిమా పూర్తి కావాలంటే ఈరోజుల్లో కనీసం సంవత్సరం పడుతుంది. దానికి వచ్చే రెమ్యునరేషన్‌ 4 కోట్ల వరకు ఉంటుంది. అలా కాకుండా స్పెషల్‌ సాంగ్‌ చేస్తే కోటి నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటుంది. దాని ప్రకారం చూస్తే ఏడాది కష్టపడి చేస్తే వచ్చే రెమ్యునరేషన్‌ రెండు స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తే వచ్చేస్తున్నాయి. దాంతో తమన్నాకి ఇదే లాభసాటిగా ఉంది. అలా ఎక్కువ స్పెషల్‌ సాంగ్స్‌ చేయడం వల్ల ఐటమ్‌ గర్ల్‌ అనే ముద్ర పడే అవకాశం ఉన్నప్పటికీ దాన్నేమీ పట్టించుకోకుండా స్పెషల్‌ సాంగ్‌ అవకాశం వస్తే వదిలిపెట్టడం లేదు. స్త్రీ2, రైడ్‌2లో స్పెషల్‌ సాంగ్స్‌ తర్వాత బాలీవుడ్‌లో వరస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రొమియో, రేంజర్‌, వివాన్‌తో పాటు మరో సినిమాలో కూడా తమన్నా స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆమెను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఇలా సాంగ్స్‌ చేస్తూ సినిమాల్లో హీరోయిన్‌కి సమానంగా కోట్లు సంపాదిస్తోంది తమన్నా.