English | Telugu

మిచౌంగ్ బాధితులకు అండగా సూర్య, కార్తీ.. రూ.10లక్షలు సాయం!

తమిళనాడు రాష్ట్రాన్ని మిచౌంగ్‌ తుపాన్‌ వణికిస్తోంది. దీని ప్రభావం వల్ల అనేక జిల్లాల్లో కనిపిస్తోంది. చెన్నయ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం పూర్తిగా జలమయం అయిపోయింది. పలుచోట్ల పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, ప్రైవేట్‌ ఆఫీసులు మూసేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే రైల్వేస్టేషన్లలోకి, విమానాశ్రయంలోకి నీరు వచ్చి చేరడంతో రైళ్ళు, విమానాలను రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా సోమవారం, మంగళవారం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్న తమిళనాడు తుపాను బాధితులను ఆదుకునేందుకుతమిళ హీరోలు, సోదరులు సూర్య, కార్తీ ముందుకు వచ్చారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆదుకునేందుకుగాను రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించి మరోసారి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు సూర్య, కార్తీ. దేశంలో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా తమ వంతు సాయం అందించడంలో ఈ సోదరులు ఎప్పుడూ ముందుంటారు. సూర్య, కార్తీ చేస్తున్న ఈ సహాయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. వీరిద్దరూ తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోలే అని ప్రశంసిస్తున్నారు.