English | Telugu
'ఏజెంట్' డిజాస్టర్.. అయినా సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తున్న బన్నీ!
Updated : May 2, 2023
సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప-1'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే పుష్ప-2 తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. అలాగే త్వరలో మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు ప్రకటించనున్నాడని సమాచారం. అందులో ఒకరు త్రివిక్రమ్ కాగా, మరొకరు సురేందర్ రెడ్డి అని తెలుస్తోంది.
టాలీవుడ్ లో బన్నీ-త్రివిక్రమ్ ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా.. మూడూ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అధికారిక ప్రకటన రానప్పటికీ వీరి కాంబోలో నాలుగో సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'SSMB 28'తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఆ తర్వాత బన్నీతో సినిమా చేయనున్నాడని సమాచారం.
ఇక బన్నీ, సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన 'రేసు గుర్రం' కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో మరో సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇటీవల 'ఏజెంట్'తో సురేందర్ రెడ్డి డిజాస్టర్ అందుకోవడంతో బన్నీతో సినిమా అనుమానమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ బన్నీ మాత్రం ఏజెంట్ రిజల్ట్ తో సంబంధం లేకుండా సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కొంతకాలం క్రితమే ఓ స్టొరీ లైన్ వినిపించగా, అది బన్నీ కి నచ్చిందట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి టీం ఆ స్క్రిప్ట్ పనిలోనే ఉందట. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని కూడా ఒకేసారి అనౌన్స్ చేయాలని బన్నీ భావిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.