English | Telugu

నందమూరి నట"సమరసింహం'' బర్త్‌డే స్పెషల్‌

మహానటులు విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రత్న, శ్రీమతి బసవరామతారకం గార్ల సత్సంతానం నందమూరి బాలకృష్ణ. 1960 june 10వ తేదీన, మద్రాసు (నేటి చెన్నై)లో బాలయ్య జన్మించారు. పులి కడుపున పులే కదా పుట్టేది.. అలా ఆ పెద్దాయన నుండి క్రమశిక్షణ, సమయపాలన, దీక్ష, పట్టుదల, తెలివితేటలతో పాటు చక్కని అందమైన రూపాన్ని కూడా బాలయ్య పొందారు. "తాతమ్మ కల" చిత్రంలో బాలనటుడిగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు బాలయ్య. తర్వాత అన్న హరికృష్ణ తో కలసి "రామ్-రహీమ్" అనే చిత్రంలో నటించారు బాలయ్య.

ఒకపక్క చదువుతూనే సినిమాల్లో కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు. చదువుకుంటూనే "అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి" వంటి చిత్రాల్లో నటించారు. తన తండ్రి గారి దర్శకత్వంలో బాలయ్య "దానవీరశూర కర్ణ" చిత్రంలో అభిమన్యుడిగా, "శ్రీమద్విరాట్‍ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" చిత్రంలో సిద్ధయ్యగా, "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రంలో హరిశ్చంద్రుడిగా, "అక్బర్ సలీం అనార్కలి" చిత్రంలో సలీంగా నటించారు. ఇలా తండ్రి గారి వద్ద నుంచి అపారమైన నటనానుభవాన్ని సంపాదించుకున్నారు బాలయ్య.

అదీగాక నిరంతరం తనను తాను కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ, ప్రేక్షకులు తననుండి ఏమేమి ఆశిస్తారో గ్రహించి, తదనుగుణంగా తన సినిమాలుండేలా జాగ్రత్తపడతారు బాలయ్య. డ్యాన్సుల్లో, ఫైట్సులో, డైలాగ్ మాడ్యులేషన్ లో, బోడీ లాంగ్వేజ్ లో, నటనలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారాయన. అదీగాక పాత్ర డిమాండ్ చేస్తే, ఆ పాత్ర కోసం ఏం చేయటానికైనా వెనుకాడని తత్వం ఆయనది. ఉదాహరణకు "భైరవద్వీపం" చిత్రంలో తన పాత్ర కురూపిగా మారాలంటే అందుకేమాత్రం జంకకుండా ఆయన ఆ పాత్రలో నటించిన తీరు అద్భుతం. అందుకాయనకు ఫిలిం ఫేర్ ఉత్తమనటుడి అవార్డు (తెలుగు) లభించింది.

ఇక రాయలసీమలో ఫ్యాక్షనిస్టులెలా ఉంటారో తెలియని ప్రేక్షకులకు "సమరసింహారెడ్డి" చిత్రంలో వారిలా ఉంటారేమోననే విధంగా నటించి చూపించారు. "సమర సింహారెడ్డి" చిత్రంలో ఆయన పలికే డైలాగులకు ప్రతి థియేటర్‌లోనూ ప్రేక్షకుల ఈలలతో, కేకలతో, చప్పట్లతో, వారి హర్షధ్వానాలతో మారుమ్రోగిందంటే అతిశయోక్తిలేదు. ఉదాహరణకు "నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ మూతి మీద మొలిచింది మీసమే అయితే...." అనే డైలాగు బాలయ్య నోటివెంట వింటేనే వాటి సార్థకత. "నరసింహనాయుడు" చిత్రంలో ఆయన నటవిశ్వరూపం ప్రదర్శించారు. ఈ చిత్రంలోని ఆయన నటనకు మెచ్చి మనరాష్ట్ర ప్రభుత్వం ఉత్తమనటుడిగా ఆయనకు నంది అవార్డునిచ్చి గౌరవించింది.

 

"దానవీరశూర కర్ణ" చిత్రంలో అభిమన్యుడిగా బాలయ్య ముగ్ధమనోహరంగా కనిపిస్తారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన కౌరవులతో పోరాడే దృశ్యాలు ప్రేక్షకులను రోమాంచితులను చేస్తుంది.3 "ఆదిత్య 369" చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన నటన "తెనాలి రామకృష్ణుడు" చిత్రంలో అన్న యన్.టి.ఆర్.కు ఏమాత్రం తీసిపోదు. "శ్రీకృష్ణార్జున యుద్ధం" (కొత్తది) చిత్రంలో ఆయన శ్రీకృష్ణుడుగా, అర్జునుడిగా ద్విపాత్రాభినయం చేసి విమర్శకుల ప్రశంసలు సైతం పోందారు. "పాండురంగడు" చిత్రంలో ఆయన నటనకు "సంతోషం" వారి ఉత్తమనటుడి అవార్డు లభించింది.

 

అది జానపదమైనా, పౌరాణికమైనా, చారిత్రాత్మకమైనా, సాంఘికమైనా ఏ చిత్రమైనా సరే బాలయ్య నటిస్తే దానికి ఒక హోదా లభిస్తుందనే స్థాయిలో బాలయ్య నటనుంటుంది. వాషింగ్ టన్ తెలుగు కల్చరల్ సొసైటీ వారు "విశ్వవిఖ్యాత నటతేజ" బిరుదునిచ్చి గౌరవించారు. ఇటీవల వచ్చిన "సింహ" చిత్రంతో మరోసారి బాలయ్య విజృంభించారు. ఈ చిత్రం సూపర్ డ్యూపర్ హిట్టయి రికార్డు కలెక్షన్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూంది. హిట్లూ, సూపర్ హిట్లూ, బ్లాక్ బస్టర్లూ, రికార్డుల్ని తిరగరాయటాలూ బాలయ్యకు వెన్నతో పెట్టి విద్య. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది ఒక్క మా బాలయ్యకే సాధ్యం అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునేలా ఆయన చిత్రాలుంటాయి.

"మంగమ్మగారి మనవడు, లారీ డ్రైవరు, రౌడీ ఇనస్పెక్టరు, ముద్దుల మామయ్య, ముద్దుల కిష్టయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, నారీ నారీ నడుమ మురారి, చెన్నకేశవరెడ్డి" ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకి అంతుండదు. బాలయ్య ప్రస్తుతం బాపు దర్శకత్వంలో "శ్రీరామరాజ్యం" సినిమాలో శ్రీరామచంద్రమూర్తిగా, పరుచూరి మురళి దర్శకత్వంలో "మహాదేవ నాయుడిగా" నటిస్తున్నారు. "మహాదేవ నాయుడు" సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో నటించటం విశేషం. బి.గోపాల్ దర్శకత్వంలో "హరహర మహాదేవ" సినిమా బాలయ్య జన్మదినోత్సవం నాడు ప్రారంభమవుతుందని వినపడుతోంది. వీరిద్దరి కాంబోనేషన్లో గతంలో వచ్చిన రౌడీ ఇనస్పెక్టర్, లారీ డ్రైవర్, సమర్సింహా రెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఎలాంటి సంచలన విజయాలు సాధించి రికార్డులు బ్రేక్ చేశాయో మనకు తెలిసిందే.