English | Telugu
లేడీస్ బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. సంధ్య థియేటర్‌లో ఉద్రిక్తత!
Updated : Jan 6, 2026
ఒకప్పుడు భారీ విజయాలు అందుకున్న సినిమాలను రీరిలీజ్ చెయ్యడం అనేది ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అందులో భాగంగానే వెంకటేశ్ హీరోగా 2001లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 1న రీరిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నోసార్లు టీవీలో ప్రదర్శించారు. అంతేకాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉంది. అయినా థియేటర్‌లో మరోసారి చూసేందుకు జనం ఎగబడ్డారు.
ఈ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఒక ఘటన అందర్నీ షాక్‌కి గురి చేసింది. బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. సినిమాకి వచ్చిన ఓ మహిళ.. లేడీస్ వాష్‌రూమ్‌కి వెళ్లినపుడు అక్కడ రహస్యంగా అమర్చిన ఒక వస్తువు కనిపించింది. దాన్ని పరిశీలించగా అది కెమెరా అని తెలిసింది. షాక్‌కి గురైన ఆ మహిళ తనతోపాటు సినిమాకి వచ్చిన వారికి ఆ విషయాన్ని చెప్పింది. అలా థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులందరికీ అది తెలిసిపోయింది. దీంతో ఒక్కసారిగా థియేటర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
థియేటర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా తేలింది. థియేటర్‌లోని వాష్‌రూమ్‌కి వచ్చే మహిళల వీడియోలను అతను రికార్డ్ చేస్తున్నాడని తెలిసింది. ఆ క్షణమే ప్రేక్షకులంతా థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఒక థియేటర్ ఉద్యోగిని చితకబాదారు. దీంతో అక్కడి వాతావరణం ఎంతో ఉద్రిక్తంగా మారింది. థియేటర్‌లో జరుగుతున్న ఆందోళన వల్ల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే థియేటర్‌కి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు. థియేటర్‌లో ఉన్న ఇతర భద్రతా లోపాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.