English | Telugu
'గుంటూరు కారం'.. మహేష్ ఫ్యాన్స్ కి మరో షాక్!
Updated : Aug 8, 2023
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్, మాస్ స్ట్రైక్ ఆకట్టుకున్నాయి. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దానికి తోడు ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ మారిపోతున్నారనే వార్తలు మహేష్ అభిమానుల అసహనానికి కారణమవుతున్నాయి. అయితే మహేష్-త్రివిక్రమ్ కాంబో మీద ఉన్న నమ్మకం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అభిమానులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఆ అంచనాలతోనే సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారికి మరోసారి నిరాశ తప్పేలా లేదు.
ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు. దీంతో అభిమానులు ఓ వైపు 'బిజినెస్ మేన్' రీరిలీజ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోతూనే, మరోవైపు 'గుంటూరు కారం' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బర్త్ డే కానుకగా 'గుంటూరు కారం' నుంచి సాంగ్ లేదా స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ 'గుంటూరు కారం' నుంచి అలాంటి బర్త్ డే సర్ప్రైజ్ ఏంలేదంట. కేవలం ఒక పోస్టర్ తోనే చిత్ర బృందం మహేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపబోతుందని సమాచారం. 'గుంటూరు కారం' అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి ఇది షాక్ అనే చెప్పాలి.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీకి సినిమా రావడం అనుమానమే అంటున్నారు.