English | Telugu
'సలార్' టీజర్.. దీని ముందు 'కేజీఎఫ్' వయలెన్స్ జుజుబి!
Updated : Jul 5, 2023
ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సలార్'. ఓ వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరోవైపు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో 'సలార్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కేవలం పోస్టర్లతోనే 'కేజీఎఫ్-2' తరహాలో బాక్సాఫీస్ ఊచకోత ఖాయమనే అభిప్రాయాన్ని ఈ సినిమా కలిగించింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది.
సలార్ టీజర్ ని ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు ఉదయం 5:12 గంటలకు విడుదల చేశారు. ఒక నిమిషం 46 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో కేవలం ఒక డైలాగ్, కొన్ని విజువల్స్ తో సినిమా ఎంత వయోలెన్స్ గా ఉండబోతుందో చూపించారు ప్రశాంత్ నీల్. క్రూరమైన మనుషుల మధ్య చిక్కుకున్న వ్యక్తి(టినూ ఆనంద్) ఏమాత్రం బెరుకు లేకుండా సలార్ ఎంత ప్రమాదకరమో పరిచయం చేస్తారు. "Simple english, no confusion. Lion, cheetah, tiger, elephant very dangerous.. but not in Jurassic park. Because in that park there is a ..." అంటూ సలార్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ని పరిచయం చేశారు. తుపాకీ, కత్తి, గొడ్డలి వంటి ఆయుధాలతో సలార్ చేసిన విధ్వంసాన్ని టీజర్ లో చూపించారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, వయలెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్ చూస్తుంటే దీని ముందు 'కేజీఎఫ్' వయలెన్స్ కూడా తక్కువే అనే అభిప్రాయం కలుగుతోంది.
'సలార్' సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నప్పటికీ ఒకటే డైలాగ్, అది కూడా ఇంగ్లీష్ లో ఉండటంతో.. ఒకే టీజర్ గా విడుదల చేశారు. ఇక ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. టీజర్ చివరిలో దానిపై స్పష్టత ఇచ్చింది మూవీ టీమ్. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుందని తెలిపింది. Part-1 కి ceasefire(కాల్పుల విరమణ) అని పేరు పెట్టారు. కాగా రెండో భాగం ఈ డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'సలార్' సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.