English | Telugu
'దేవర'కు బ్రేక్ ఇచ్చిన సైఫ్ ఆలీఖాన్
Updated : Aug 15, 2023
సైఫ్ అలీ ఖాన్ గురించి నార్త్ లో ఎంత ఇంట్రస్టింగ్‌గా మాట్లాడుకుంటారో, అంతకు మించి ఇంట్రస్ట్ గా చెప్పుకుంటున్నారు తెలుగు జనాలు. ఆయన ప్రస్తుతం తెలుగులో చేస్తున్న ప్రాజెక్ట్ అలాంటిది మరి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న 'దేవర'లో నటిస్తున్నారు సైఫ్. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో పాటు బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలని బ్రేక్ తీసుకున్నారు.
'దేవర' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొంటున్నారు. ఈ హెక్టిక్ షెడ్యూల్ నుంచి ఆయన రెండు రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఆయన పుట్టినరోజు ఆగస్టు 16. కరీనా కపూర్, తైమూర్, జేతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలన్నది సైఫ్ నిర్ణయం. అందుకే ఆయన షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.
పలు రకాల భావోద్వేగాల రోలర్ కోస్టర్‌గా తెరకెక్కుతోంది దేవర సినిమా. భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే మాన్‌స్టర్‌గా కనిపిస్తారు ఎన్టీఆర్. ఆయనకు, సైఫ్‌కీ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయన్నది ఇన్‌సైడ్ టాక్.
సౌత్‌లో సినిమా ప్రమోషన్ల బాధ్యతను తారక్ చూసుకుంటే, నార్త్ లో తాను భుజం కాస్తానని ఆల్రెడీ మాటిచ్చేశారట సైఫ్. ఆయన పుట్టినరోజున దేవర నుంచి ఆయన గెటప్‌ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించిన సినిమాలేవీ విడుదల కాకపోవడంతో, దేవర మీద దృష్టి నిలిపారు నందమూరి అభిమానులు.