English | Telugu
'మంగళవారం'లో పాయల్ రాజ్‌పుత్!
Updated : Feb 20, 2023
'ఆర్‌ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో చిత్రంగా శర్వానంద్, సిద్ధార్థ్ తో కలిసి ఆయన తీసిన 'మహాసముద్రం' మంచి అంచనాలతో విడుదలై తీవ్ర నిరాశపరిచింది. దీంతో తన మూడో సినిమాని పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా తీసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి 'మంగళవారం' అనే ఆసక్తికర టైటిల్ పెట్టినట్టు ఇప్పటికే న్యూస్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ని రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది.
అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమైన 'ఆర్‌ఎక్స్ 100'తోనే పాయల్ రాజ్‌పుత్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రంలో కార్తికేయకు జోడీగా నటించిన ఆమె తన గ్లామర్ తో కుర్రకారుని ఫిదా చేసింది. ఆ ఒక్క చిత్రం ఆమెకు తెలుగులో ఎన్నో అవకశాలు వచ్చేలా చేసింది. అయితే ఆమెకు ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. ఈ క్రమంలో అజయ్ భూపతి ఆమెకు మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
'మంగళవారం' అనే టైటిల్ తో అజయ్ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తున్నట్టు సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమ, వినోదంతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. పాయల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ స్వయంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది అంటున్నారు.