English | Telugu

ఆర్ఆర్ఆర్ హీరోకి నేషనల్ అవార్డు వచ్చుంటే పరిస్థితి ఏంటి?

69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో పుష్ప: ది రైజ్ చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. బన్నీ కి నేషనల్ అవార్డు రావడం పట్ల దాదాపు అందరు హీరోలు, అందరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ తెలుగు హీరోకి జాతీయ అవార్డు రావడం పట్ల గర్వపడుతున్నారు. అయితే ఒకవేళ ఇదే అవార్డు ఆర్ఆర్ఆర్ హీరోలలో ఒకరికి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఆర్ఆర్ఆర్ లో ప్రధాన పాత్రలు పోషించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతమంచి స్నేహితులో.. సినిమా విడుదల తరువాత వారి అభిమానులు అంత శత్రువులు అయ్యారు. మా హీరోనే మెయిన్ హీరో, మా హీరోనే బాగా నటించాడు అంటూ సోషల్ మీడియాలో వార్ కి దిగారు. సినిమా విడుదలై ఏడాది దాటినా ఇప్పటికీ ఆ వార్ నడుస్తూనే ఉంది. నిజానికి ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ అద్భుతంగా నటించారు. ఎవరి నటనను తక్కువ చేయలేం. కానీ అభిమానులు మాత్రం మన హీరోలు బాగా నటించారని చెప్పడానికి మనసొప్పక.. మా హీరోనే బాగా నటించాడని ఎదుటి హీరోని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం ఉత్తమ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్రకైనా న్యాయం చేయగల అతికొద్ది మంది స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ లో భీమ్ పాత్రతో ఆయన మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశారు. ఎన్టీఆర్ నటన గొప్పతనం గురించి చెప్పడానికి ఒక్క కొమురం భీముడో పాట చాలు. ఇక రామ్ చరణ్ కూడా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటుడిగా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మగధీర, రంగస్థలం సినిమాల్లో అయా పాత్రల్లో చరణ్ ని తప్ప వేరే హీరోని ఊహించుకోలేం అనే అంతలా మ్యాజిక్ చేశారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ పాత్రకి కూడా చరణ్ తప్ప మరో పేరే మైండ్ లోకి రాదు. అంతలా తన నటనతో కట్టిపడేశారు. ఇలా ఎన్టీఆర్, చరణ్ వారి నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకునే అర్హత ఆ ఇద్దరికీ ఉంది. అయితే పొరపాటున ఇద్దరిలో ఒకరికి నేషనల్ అవార్డ్ వచ్చి ఉంటే సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగేది. అవార్డ్ వచ్చిన హీరో అభిమానులు మరో హీరో మీద దారుణంగా ట్రోల్స్ చేసేవారు. అయితే పుష్ప రాజ్ ఎంట్రీతో ఈ యుద్ధానికి బ్రేక్ పడింది. అల్లు అర్జున్ కి అవార్డ్ రావడంతో మెగా కుటుంబానికి చెందిన హీరోకి అవార్డ్ వచ్చిందని మెగా అభిమానులు సంబరపడుతున్నారు. తమ హీరో ఎన్టీఆర్ ని బావ అని పిలుస్తూ సొంత మనిషిలా ఉండే బన్నీకి అవార్డ్ రావడం పట్ల నందమూరి అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.