English | Telugu
రజనీకాంత్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. గాయపడిన రితిక!
Updated : Dec 4, 2023
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిగా ఇండియా తరఫున పలు టోర్నమెంట్లలో పాల్గొన్న రితిక సింగ్ 2012లో తమిళ్‌లో వచ్చిన ‘ఇరుదచుట్రు’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను హిందీలో ‘సాలా ఖుద్దూస్’ పేరుతో, తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూడు భాషల్లోనూ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన రితికకు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 170వ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రితిక గాయపడిరది. చేతులపై అక్కడక్కడా గీరుకుపోయి రక్తం కారుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రితిక.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను అజాగ్రత్తగా వ్యవహరించినందువల్లే గాయమైందని వివరించింది రితిక. అప్పటికీ అందరూ జాగ్రత్తగా చెయ్యమని చెబుతున్నా తాను పట్టించుకోకపోవడం వల్లే ఇలా గాయమైందని తెలిపింది. క్షణాల్లో జరిగే ప్రమాదాలను నివారించడం అసాధ్యమని చెబుతూ, ఓ గాజు అద్దం వల్లే తనకు ప్రమాదం జరిగిందని చెప్పింది. దీంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చానని, తాను కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటానని తెలియజేసింది.