English | Telugu

స్పందించిన మహిళా కమిషన్‌.. మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు!

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. త్రిషను ఉద్దేశించి అతను చేసిన కామెంట్స్‌ గురించి పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి, త్రిషకు మద్దతు తెలిపారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో జాతీయ మహిళా కమిషన్‌ ఈ కేసును సుమోటా స్వీకరించింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌పై కేసు నమోదు చెయ్యాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో థౌజండ్‌ లైట్స్‌ పోలీసులు మన్సూర్‌ అలీఖాన్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

‘లియో’ చిత్రంలో విజయ్‌కి జంటగా నటించింది త్రిష. ఈ సినిమా మన్సూర్‌ కూడా ఒక పాత్ర పోషించాడు. ఎన్నో సినిమాల్లో చాలా రేప్‌లు చేసిన తనకు ఈ సినిమాలో కూడా త్రిషను రేప్‌ చేసే అవకాశం వస్తుందని ఎదురుచూశాను. కానీ, తనకు త్రిషను చూపించను కూడా లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఎంతోమంది సినీ ప్రముఖులు మన్సూర్‌ తీరును తప్పుబట్టారు. ఇలాంటి వారిని శిక్షించేందుకు చట్టాలు తీసుకురావాలని అన్నారు. దీనిపై స్పందించిన మన్సూర్‌.. తాను తప్పు చేయలేదని, ఎవ్వరికీ భయపడనని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అనడంతో ఈ వివాదం మరింత జఠిలంగా మారింది. ఇప్పుడు మన్సూర్‌ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది.