English | Telugu
ప్రభాస్ టాప్ మూవీస్.. మీ ఫేవరెట్ మూవీ ఏది?
Updated : Oct 22, 2023
అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగేలా చేసిన కొన్ని సినిమాల వివరాలు చూద్దాం.
వర్షం:
ఈశ్వర్,రాఘవేంద్ర సినిమా ల తర్వాత 2004 సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రభాస్ మూవీ వర్షం. ఈ మూవీ తోనే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రభాస్ జైత్రయాత్ర ప్రారంభం అయ్యింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనని అపార్ధం చేసుకొని దూరమైపోయి పెద్ద సినిమా హీరోయిన్ అయిపోతుంది. ఆ తర్వాత విలన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. అప్పుడు ప్రభాస్ ..తన తండ్రిహార్ట్ ఆపరేషన్ డబ్బులు కోసం హీరోయిన్ ని తీసుకురావడానికి ఒప్పుకొంటాడు. అలా హీరోయిన్ ని తీసుకుకొచ్చే ప్రాసెస్ లో హీరోయిన్ అయినా తన ప్రేయసి మనసులో తాను ఉన్నానని తెలుసుకొని విలన్ ని అంతమొందించే క్యారక్టర్ లో ప్రభాస్ సూపర్ గా నటించాడు. ఈ సినిమాతోనే ప్రభాస్ స్టార్ హీరో స్టేటస్ కి అంకురార్పణ జరిగింది.
ఛత్రపతి:
2005 లో వచ్చిన ఛత్రపతి సినిమా ఆ పేరుకి తగ్గట్టే ప్రభాస్ ని తెలుగు సినిమా పరిశ్రమకి ఛత్రపతిని చేసింది. తన తండ్రి రెండవ భార్యనే తల్లిగా ఆరాధిస్తూ ఆ తల్లికి దూరమయ్యి మత్యకారుల నెపంతో స్మగుల్డ్ వ్యాపారం చేసే కొంత మంది అసాంఘిక శక్తుల చేతుల్లో ప్రభాస్ బానిసగా బతుకుతుంటాడు. ఆ తర్వాత వాళ్ళు చేసే దౌర్జన్యాలని ఎదిరించి వాళ్ళని చంపి అదే సామ్రాజానికి కింగ్ అవుతాడు. ఆ తర్వాత తనని ద్వేషించే తన తమ్ముడి ద్వారా తల్లి ఆచూకీని తెలుసుకొని తల్లి కి తానెవేరో చెప్పకుండా తల్లి సంతోషం కోసం తమ్ముడుని గొప్ప వాడ్ని చేస్తాడు. కానీ విలన్ కుట్ర వలన తన తల్లి చేతుల్లోనే తుపాకీ కాల్పులకి గురయ్యే క్యారెక్టర్ లో ప్రభాస్ నటనకి వెండితెర సైతం పులకరించి పోయింది. ఈ సినిమా తోనే ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.
బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై:
2008 లో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా ఈ సినిమాలోని ప్రభాస్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీకి కొన్ని లక్షల మంది ప్రభాస్ కి అభిమానులుగా మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ కామెడీని కూడా సూపర్ గా చెయ్యగలడని బుజ్జిగాడు మూవీ రుజువు చేసింది. ప్రతి విషయాన్నీ సరదాగా తీసుకుంటూ సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ చిన్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం వెతికే క్యారక్టర్ లో ప్రభాస్ నటన సూపర్ గా ఉంటుంది. కానీ తను వెతుకున్న అమ్మాయి తన కళ్లెదురుగానే ఉన్నా కూడా ప్రభాస్ గుర్తుపట్టక పోవడం విపరీతమైన నవ్వుని తెప్పిస్తుంది. ఈ సినిమా లో ప్రభాస్ ప్రతి వ్యక్తిని ఇదిగో డార్లింగ్ అని పిలుస్తుండటం సినిమా మొత్తానికే హైలెట్.
డార్లింగ్:
2010 లో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ప్రభాస్ ని అమ్మాయిలకి అలాగే కుటుంబ ప్రేక్షకులకి చాలా దగ్గర చేసింది. చిన్నప్పటి నుంచి ఒకమ్మాయిని గాఢంగా ప్రేమించి, తన తండ్రి పరువు కోసం ఆ అమ్మాయి ప్రేమని వదులుకుందామనుకునే క్యారక్టర్ లో ప్రభాస్ నటన సూపర్ గా ఉంటుంది. అలాగే కామెడీ పండించడంలో ప్రభాస్ ఈ సినిమాతో ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు.
మిస్టర్ పర్ఫెక్ట్:
2011 లో వచ్చిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లో అప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల రికార్డు లని చెరిపివేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. చిన్నప్పటి నుంచి అవతలి వాళ్ళ ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా కేవలం గెలవడంలో మాత్రమే కిక్ ఉందని ప్రభాస్ భావిస్తాడు. తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రేమని లెక్క చెయ్యకుండా ప్రాక్టికల్ మనిషిగా ఉంటూ ఆ తర్వాత తన లాంటి భావాలు కలిగి ఉన్న అమ్మాయి పరిచయంతో తన మెంటాలిటీ ఎంత రాంగో తెలుసుకొని, తనని ప్రేమించే అమ్మాయి ప్రేమ కోసం ఆరాటపడే క్యారక్టర్ లో ప్రభాస్ నటన నభూతో నభవిష్యత్తు.
మిర్చి:
2013 లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. శత్రువులు తన తల్లిని చంపినా కూడా తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ శత్రువుల ఇంటిలో ఉంటూ వాళ్ళని మంచి మనుషులుగా మార్చే క్యారక్టర్ లో ప్రభాస్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా లో ప్రభాస్ విలన్ తో ఒక డైలాగ్ చెప్తాడు. కత్తి వాడటం మొదలెడితే నాకంటే ఎవరు బాగా వాడలేరు అని.. ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ తెలుగు ప్రేక్షకులని ఉర్రుతలూగించింది.
బాహుబలి 1:
ఈ సినిమా వచ్చే వరకు తెలుగు కళామతల్లి ప్రభాస్ కి పేరు ప్రతిష్టలని ఇస్తే, బాహుబలి సినిమా తో ప్రభాస్ తెలుగు కళామ తల్లికి పేరు ప్రతిష్టలని ఇచ్చాడు. ఈ సినిమా తో తెలుగు సినిమా కీర్తిని తన అద్భుతమైన నటనతో, సాహసాలతో విశ్వవ్యాప్తం చేసిన నటుడుగా కూడా ప్రభాస్ గుర్తింపుని తెచ్చుకున్నాడు. తన ఒంట్లో రాజవంశానికి చెందిన రక్తం ప్రవహిస్తున్న విషయం తెలియక తన రాజ్యానికి వెళ్లి బందీగా ఉన్న తన తల్లిని కలుసుకొని తన పుట్టుక గురించి తెలుసుకునే క్యారక్టర్ లో ప్రభాస్ నటనకి అఖండ భారతం సాహో అని చెయ్యెత్తి జై కొట్టింది.
బాహుబలి 2:
బాహుబలి పార్ట్1 కి కంక్లూజ్ గా వచ్చిన ఈ మూవీ లో కూడా ప్రభాస్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించడమే కాకుండా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కి తెలుగు సినిమా ముద్ర ఎప్పటికి ఉండేలా చాటాడు. అమరేంద్ర బాహుబలి గా తన రాజ్య క్షేమం కోసం తన తల్లి సంతోషం కోసం తన ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించే పాత్రలో ప్రభాస్ నటన హిమాలయ శిఖరాల స్థాయిని దాటింది.
ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో అలరించిన ప్రభాస్ అతి త్వరలో సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.