English | Telugu
'అమిగోస్'కి అదే మైనస్ అయిందా?
Updated : Feb 14, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కానీ ఆయన చేసే కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల విజయాల కంటే పరాజయాలనే ఎక్కువగా ఎదుర్కొంటున్నాడు. తాజాగా 'అమిగోస్' విషయంలో కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకొని, సాదాసీదా కలెక్షన్లతో ఫ్లాప్ దిశగా పయనిస్తోంది.
ఒక హీరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే తన తదుపరి సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడం సహజం. కానీ కళ్యాణ్ రామ్ 'అమిగోస్' విషయంలో మాత్రం అలా జరగలేదు. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. 'బింబిసార' మొదటి రోజు ఏకంగా రూ.7 కోట్లకు పైగా షేర్ రాబడితే.. 'అమిగోస్' నాలుగు రోజులకి కలిపి కూడా రూ.6 కోట్ల షేర్ రాబట్టలేకపోయింది. మొదటిరోజు రెండున్నర కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది.
బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నటించిన సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు మంచి వసూళ్లు వస్తుంటాయి. కానీ 'అమిగోస్' విషయంలో అది జరగలేదు. దానికి ప్రధాన కారణం టైటిల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ టైటిల్ చాలామందికి అర్థం కాలేదు. సాధారణ ప్రేక్షకులను ఆ టైటిల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. టాక్ బాగుండి ఉంటే కలెక్షన్స్ పెరిగి ఉండేవేమో కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నా.. టైటిల్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఓపెనింగ్స్ రాబట్టగలగాలి. దానివల్ల బయ్యర్లు నష్టాలను తప్పించుకునే అవకాశముంటుంది. పైగా కళ్యాణ్ రామ్ విజయాలు అందుకున్న అతనొక్కడే, పటాస్, బింబిసార వంటి సినిమాల్లో కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎంత కొత్తగా ట్రై చేసినా అందులో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉండాలి. అప్పుడే విజయాలు వరిస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం.