English | Telugu

నా కంపెనీలో సినిమా తియ్యాలనుకున్నాను.. కానీ అమ్ముకోవాల్సి వచ్చింది

సినిమా రంగంలో పనిచేసే నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్‌ ఎవరైనా తమ కెరీర్‌లో సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మనం చూస్తుంటాం. ఈమధ్య ఎక్కువ శాతం రియల్‌ ఎస్టేట్‌లోనే తమ పెట్టుబడులు పెడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు సినీ ప్రముఖులు. ఇక కొంతమంది ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కంటే తామే ఓ కంపెనీ స్థాపిస్తే ఎంతో మంది ఉపాధి కూడా కల్పించవచ్చన్న ఆలోచనతో టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు, హోటల్స్‌.. ఇలా తమ సారధ్యంలో స్థాపిస్తున్నారు. జయాపజయాలు ఎక్కడైనా సర్వసాధారణం. కొంతమంది బిజినెస్‌లో సక్సెస్‌ అవుతారు. మరికొందరు కాలేరు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము నెలకొల్పిన కంపెనీలను అమ్ముకోవాల్సి వస్తుంది.

ఇప్పుడు నటుడు రానా దగ్గుబాటికి అదే పరిస్థితి ఏర్పడిరది. ఆ వివరాలు ఏమిటో రానా దగ్గుబాటి స్వయంగా తెలియజేస్తూ ‘నేను 18 సంవత్సరాల వయసులో స్పిరిట్‌ మీడియా అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థను స్థాపించాను. అందులో నేను 5 సంవత్సరాలు పనిచేశాను. నేను నెలకొల్పిన సంస్థ ద్వారా ఎప్పటికైనా సినిమా తియ్యాలనేది నా యాంబిషన్‌. కానీ, అది నెరవేరలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కంపెనీ నిర్వహణ చాలా కష్టతరమైపోయింది. దాంతో ఎన్నో ఆలోచనలతో 2005లో స్టార్ట్‌ చేసిన నా కంపెనీని మూసేశాను. దాన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థ అయిన ప్రైమ్‌ ఫోకస్‌కి అమ్మేశాను. ఈ సంస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పెద్ద విజువల్‌ ఎఫెక్ట్‌ సంస్థగా మారింది. అయితే నా కంపెనీని అమ్మకానికి పెట్టినపుడు నేను బాధ పడలేదు. ఎందుకంటే వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి అనేది తెలియనప్పుడు దాని నుంచి తప్పుకోవడమే ఉత్తమమైన పని. రానా విక్రయించిన స్పిరిట్‌ మీడియా ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి’ సినిమాకు అంతర్జాతీయ మార్కెట్‌ భాగస్వామిగా ఉంది.