English | Telugu

రూ. 400 కోట్ల క్లబ్ లో 'జైలర్'.. విజయ్, కమల్ ని బీట్ చేసిన రజినీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ కి సరైన సినిమా పడితే ఎలాంటి రికార్డులైనా బద్ధలే. 'జైలర్' విషయంలో అది మరోసారి రుజువైంది. సర్వత్రా రికార్డు స్థాయి వసూళ్ళతో ముందుకు సాగుతూ.. ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోందీ యాక్షన్ థ్రిల్లర్. ప్రధానంగా తమిళంలో రూపొందిన 'జైలర్'.. తెలుగులోనూ అదిరిపోయే వసూళ్ళు రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్క్ చూడడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే మొదటి ఆరు రోజులకి గానూ రూ. 400 కోట్ల గ్రాస్ చూసింది 'జైలర్'.

ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. విజయ్ నటించిన 'వారిసు' (వారసుడు) మూవీకి సంబంధించిన లైఫ్ టైమ్ గ్రాస్ ని కేవలం 4 రోజుల్లో దాటేసిన 'జైలర్'.. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా తాలూకు లైఫ్ టైమ్ గ్రాస్ ని కేవలం ఆరు రోజుల్లో క్రాస్ చేయడం విశేషం. మరి.. రాబోయే రోజుల్లో 'జైలర్' పేరిట ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి.

కాగా, 'జైలర్'కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. యువ సంగీత సంచలనం అనిరుధ్ బాణీలు కట్టాడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.