English | Telugu
‘ఇండియన్ 2’ కోసం టైమ్ కేటాయిస్తున్న రాజమౌళి!
Updated : Nov 2, 2023
కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగులో ‘భారతీయుడు’గా విడుదలై ఇక్కడా ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. 1996లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఎన్నో సంవత్సరాల క్రితమే శంకర్ ప్రకటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఒక సమయంలో ఇండియన్ 2 చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి దిల్‌రాజు తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించింది. రేపు ఇండియన్-2 ఇంట్రో రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగులో రాజమౌళి విడుదల చేయనుండగా, తమిళంలో రజనీకాంత్ చేతులమీదుగా విడుదల చేయనున్నారు. నవంబరు 7న కమల్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంలోనే రేపు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్-2 ఇంట్రోను చిత్రబృందం కమల్ అభిమానులకు కానుకగా అందించనుంది. కాగా, ఈ ఇంట్రోను కన్నడలో కిచ్చ సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో ఆమిర్‌ఖాన్ రిలీజ్ చేస్తున్నారు.