English | Telugu

అట్ట‌ర్ ఫ్లాప్ అయిన రాజ‌మౌళి ప్లాన్‌



బాహుబ‌లి సినిమా చూడ్డానికి వెళ్లిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు... అసంతృప్తితో, అర్థాక‌లితో బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌న్న‌ది వాస్త‌వం. ఆఖ‌రికి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా దారుణంగా నీర‌స‌ప‌డిపోయారు. త‌మ హీరోని స‌రిగా వాడుకోలేద‌ని కొంద‌రంటే... ఏ పాత్ర‌కూ స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని సినీ విశ్లేష‌కులు తీర్పులు ఇచ్చేశారు. సెకండాప్ కోసం ఫ‌స్ట్ ఆఫ్‌ని బ‌లి ప‌శువు చేశార‌న్న విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో క‌థ‌ని లాగ‌డం కోసం, కొన్ని ట్విస్టుల్నీ, ప్ర‌ధాన ఘ‌ట్టాల్నీ అట్టే పెట్టుకొన్నాడు రాజ‌మౌళి. ఈ ప్లాన్ దారుణంగా బెడ‌సికొట్టింది. బాహుబ‌లి ది బిగినింగ్‌ని ఎక్క‌డా అదిరిపోయే రెస్పాన్స్ అయితే లేదు. ఈ విష‌యం టీమ్‌కీ ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. ఫ‌స్టాఫ్‌కి ఇలా ఓకే మూవీ అనే స్పంద‌న వ‌స్తే... సెకండాఫ్‌పై ప్రేక్ష‌కుడికి ఆస‌క్తి ఎక్క‌డ ఉంటుంది..? ఎగ‌బ‌డి ప్ర‌మోష‌న్లు చేసిన మీడియా కూడా సెకండాఫ్ పార్ట్ విష‌యంలో మౌనంగా ఉండిపోవ‌డం ఖాయం అనిపిస్తోంది.

బాహుబ‌లి 2కి ఈ స్థాయిలో హైప్ రావ‌డం, జ‌నాలు ఇంత ఇదిగా ఎదురుచూడ‌డం క‌ల్ల‌. బ‌య్య‌ర్లు కూడా ఎగ‌బ‌డి కొనేంత సీన్ ఉండ‌దు. సో.. ఇలాంటి ప‌రిస్థితిలో బాహుబ‌లి పార్ట్ 2పై ఫోక‌స్ పెట్టడానికి అటు న‌టీన‌టులు, ఇటు సాంకేతిక నిపుణులూ ముందుకు రాక‌పోవ‌చ్చు. అయితే రాజ‌మౌళిని విసిగిస్తున్న విష‌యం ఏంటంటే... పార్ట్ 2లో ఇప్ప‌టికే 40 శాతం షూటింగ్‌పూర్త‌య్యింది. పార్ట్ 2 మొద‌లెట్ట‌క‌పోతే.. ఆ ఆలోచ‌న విర‌మించుకొని మ‌రో సినిమాపై దృష్టి పెట్టేవాడే. కానీ 40 శాతం షూటింగ్ అయిపోయింది. పార్ట్ 2ని ఆశ చూపే.. బ‌య్య‌ర్ల‌కు భారీ మొత్తాల్లో సినిమా అమ్ముకొన్నారు. ఇప్పుడు వాళ్ల కోస‌మైనా సినిమా తీయాల్సిందే. పైగా ఈ క‌థ మ‌ధ్య‌లో వ‌దిలేశాడు రాజ‌మౌళి. దాన్ని పూర్తిగా చెప్ప‌కపోతే రాజ‌మౌళి ఫెయిల్ అయిన‌ట్టే లెక్క‌.

సో.... క‌థ‌ని పూర్తి చేయ‌డానికైనా సెకండ్ పార్ట్ ఉంటుంది. మ‌రీ ఇంత భారీగా కాక‌పోయినా. `ఏదో పూర్తి చేశాం` అన్న పేరుకైనా పార్ట్ 2 ముగించాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. అయితే మ‌ధ్య‌లో ఓసినిమా చేసి పార్ట్ 2 జోలికి వెళ్లాలా? లేదంటే ఈ గొడ‌వ వ‌దిలించుకొని కొత్త సినిమా మొద‌లెట్టాలా అనేది మాత్రం తేల్చుకోలేక‌పోతున్నాడు జ‌క్క‌న్న‌. ఈసారైనా విజువ‌ల్స్‌పై దృష్టి త‌గ్గించి.. క‌థ‌పై ఫోక‌స్ పెడితే గానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌దు. ఆ విష‌యం జ‌క్క‌న్న గుర్తుపెట్టుకొంటే మంచిది.