English | Telugu
‘పులి మేక’ వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Feb 25, 2023
వెబ్ సిరీస్: పులి మేక
కథ: కోన వెంకట్
తారాగణం: ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హనుమంత్, రాజు చెంబోలు, నోయల్, ముక్కు అవినాష్, సాయి శ్రీనివాస్, స్పందన పల్లి, గోపరాజు రమణ తదితరులు.
సినిమాటోగ్రఫీ: రామ్ కె.మహేశ్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్: చోట కె. ప్రసాద్
నిర్మాతలు: కోన ఫిలిం కార్పొరేషన్ & జీ5
దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి
సినిమా డైరెక్టర్లు ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా హరీష్ శంకర్ కథ అందించిన ఏటీమ్ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. అయితే అదే తరహాలో కోన వెంకట్ ఒక కథని రాసుకున్నాడు. సీరియల్ కిల్లర్ చేసే వరుస హత్యలను కనిపెట్టడానికి పోలీసులు చేసే విశ్వప్రయత్నం.. అసలు హత్యలు చేసేది జంతువా? మనిషా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు.. ఈ కథేంటి ఒకసారి చూసేద్దాం..
కథ:
కరీంనగర్ లో ఒక సైకో కిల్లర్ రాత్రిపూట బిచ్చగాళ్ళని అతిదారుణంగా చంపుతున్నాడని తెలుస్తుంది. దాంతో పోలీసులు నిఘా వేస్తారు. అతడిని అర్థరాత్రి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి పట్టుకుంటుంది పోలీస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ(లావణ్య త్రిపాఠి). ఆ కేస్ సాల్వ్ చేసాక కిరణ్ ప్రభకి వరంగల్ కి ట్రాన్సఫర్ చేస్తాడు వాళ్ళ బాస్ పోలీస్ కమీషనర్ అయిన అనురాగ్ కులకర్ణి (సుమన్). వరంగల్ లోని కేస్ ని త్వరగా పరిష్కరిస్తుంది కిరణ్ ప్రభ. అది పూర్తయిన వెంటనే హైదరాబాద్ కి ట్రాన్సఫర్ చేస్తాడు బాస్ . హైదరాబాద్ లో ఒక ఇన్స్పెక్టర్ చనిపోయాడని చెప్పి రమ్మని చెప్తాడు.. అక్కడ పోస్ట్ మార్టంలో ఫోరెన్సిక్ అధికారి ప్రభాకర్ శర్మ(ఆది సాయి కుమార్) పరిచయమవుతాడు. ప్రభాకర్ శర్మ ఈ మర్డర్ మిస్టరీని చేదిస్తూ ఒక క్లూని పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తాడు. ఆ క్లూ ఏంటి? ఆ క్లూ ఆధారంగా సైకో కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అనేదే అసలు విషయం తెలుసుకోవాలంటే 'పులి మేక' చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'పులి మేక'. మొత్తం ఎనిమిది భాగాలుగా ఉన్న ఈ సిరీస్.. ఒకటి రెండు చోట్ల తప్పా ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సస్పెన్స్ తో పాటు ట్విస్ట్ లని జోడిస్తూ.. ప్రతీ ఎపిసోడ్ కి అంచనాలు మారిపోతూ ఉంటాయి.
ఈ కథ మొదట ఒక సీరీయల్ కిల్లర్ ని పట్టుకున్న కిరణ్ ప్రభ(లావణ్య త్రిపాఠి) తో ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లోని రైల్వే ఫ్లాట్ ఫారమ్ మీద ఒక పోలీస్ అధికారి శవం దగ్గర ఫోరెన్సిక్ అధికారిగా ప్రభాకర్ శర్మ(ఆది సాయి కుమార్) కన్పిస్తాడు. ఈ శవం దగ్గర దొరికిన బాడీలోని గోర్లలో ఒక హెయిర్ దొరుకుతుంది. కానీ అది మనిషిది కాదు.. ఒక పులి లేదా ఏదైనా జంతువు ఫర్ అని గుర్తిస్తాడు. అయితే ఈ ఫర్ లాంటిదే గతంలో శామీర్ పేట్ లేక్ దగ్గర జరిగిన మర్డర్ దగ్గర కూడా లభిస్తుంది. దీంతో ఈ మర్డర్ లు చేస్తుంది ఒక సీరియల్ కిల్లర్ అని పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తాడు ప్రభాకర్ శర్మ. పోలీస్ కమీషనర్ అనురాగ్ కులకర్ణి(సుమన్) హంతకుడిని తొందరగా పట్టుకోవాలని ఆ కేస్ ని కిరణ్ ప్రభకి అప్పగిస్తాడు. ఆ తర్వాత కిరణ్ ప్రభ, ప్రభాకర్ శర్మల లవ్ డ్రామా అంతా కలిపి మూడు ఎపిసోడ్ ల వరకూ సాగుతుంది. ఇక నాల్గవ ఎపిసోడ్ లో ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కనిపెట్టేస్తాడు ప్రభాకర్ శర్మ.. ఆ తర్వాత నాలుగు ఎపిసోడ్ లలో వచ్చే సస్పెన్స్, ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఫుల్ గా ఎంగేజ్ చేసారు మేకర్స్.. ఇంతకీ ఆ వరుస హత్యలు చేస్తుందెవరూ? పులి తోలు వేసుకున్న మనిషా? లేక పులా? అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలకి బిజిఎమ్ ప్లస్ అవుతుంది. ఈ సిరీస్ లో ప్రవీణ్ లక్కరాజు అందించిన బిజిఎమ్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కిల్లర్ ని రివీల్ చేసేప్పుడు వచ్చే బిజిఎమ్ బాగుంటుంది. అయితే సాంగ్స్ కి అసలు స్కోప్ లేని సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో ఒక పాటను ఉంచారు మేకర్స్. రామ్ కె మహేష్ కెమెరా పనితనం బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో రివీల్ అయ్యే ట్విస్ట్ కోసం ప్రేక్షకులను చివరి వరకూ కూర్చోబెట్టేలా ఈ సిరీస్ ని తీర్చిదిద్దాడు డైరెక్టర్. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడేవారికే కాకుండా కామన్ ఆడియన్స్ కి నచ్చుతుంది.
నటీనటుల పనితీరు:
కిరణ్ ప్రభా అలియాస్ లావణ్య త్రిపాఠి ఈ కథకి మూలం. తన పాత్రలో తను ఒదిగిపోయింది. ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది. ఫోరెన్సిక్ అధికారిగా ప్రభాకర్ శర్మ అలియాస్ ఆది సాయి కుమార్ అదరగొట్టాడు. మర్డర్ జరిగిన స్పాట్ లో దొరికిన ఆధారాలతో కిల్లర్ ని కనిపెట్టే సీన్స్ లో తన ఇంటిలిజెన్స్ ని కనబరిచాడు. ఇక బాస్ పోలీస్ కమీషనర్ అనురాగ్ కులకర్ణి అలియాస్ సుమన్.. పై అధికారిగా ఎలా ఉండాలో అలానే ఉంటూ తన పాత్రకి న్యాయం చేశాడు. పల్లవిగా సిరి హనుమంత్ కీలక పాత్ర చేసింది. ఆ తర్వాత పోలీస్ అధికారిగా ఉన్నంతలో నోయల్ పర్వాలేదనిపించాడు. జబర్దస్త్ యాక్టర్ ముక్కు అవినాష్ హీరోకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇక మిగిలిన వాళ్ళు ఉన్నంతలో వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగా నటించారు.
తెలుగువన్ పర్సెపెక్టివ్:
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూడొచ్చు. కామన్ ఆడియన్స్ తో పోలిస్తే సస్పెన్స్ మూవీ లవర్స్ కి ఈ వెబ్ సిరీస్ ఒక ఫీస్ట్ అనే చెప్పొచ్చు.
రేటింగ్:3 / 5
✍🏻. దాసరి మల్లేశ్