English | Telugu

లాభాలలో వాటా కోసం ప్రభాస్ వర్కౌట్!

పారితోషికం తీసుకోకుండా వచ్చే లాభాలలో వాటా అనేది రెండంచుల కత్తి లాంటిది. సినిమా హిట్ అయి లాభాలు వస్తే రెమ్యూనరేషన్ కంటే అధిక మొత్తం వస్తుంది. ఏదైనా తేడా జరిగి సినిమా ఫ్లాప్ అయితే అసలు పారితోషకం అనేది లేకుండా పోతుంది. ఇక విషయానికి వస్తే ఈ మధ్య మన సినిమాల బడ్జెట్లు చుక్కలు దాటుతున్నాయి. పెరిగిన మార్కెట్, తెలుగు సినిమా స్టాండర్డ్ బట్టి మేకర్స్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.హిట్టు బ్లాక్ బస్టర్ అయితే ఓకే. ఏమాత్రం తేడా వచ్చిందా... నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ న‌ష్టాల‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇటీవల చాలా చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ప్రభాస్ నటించిన సాహూ, రాధేశ్యామ్ చిత్రాలు పూర్తిగా డిజాస్టర్ గా నిలవడంతో అందరూ నష్టపోయారు. బయటకు బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేసిన సినిమాలు కూడా అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి.

పుష్పా చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అన్నారు. అయితే ఈ మూవీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను తెచ్చి పెట్టిందని ఇటీవల దర్శకుడు తేజ చెప్పారు. లెక్కలతో సహా నిరూపిస్తానన్నారు. కాబట్టి ప్రభాస్ కూడా కాస్త ప్లాన్డ్‌గా ముందుకు వెళుతున్నారు. క్రేజ్ ను బట్టి కాకుండా క‌థ‌ని బట్టి ఖర్చు చేయిస్తున్నాడట. తాను అనుకున్న సినిమా కథను బట్టి ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అవసరమో అంతే ఖర్చు చేయిస్తున్నాడని, అనువైన బడ్జెట్‌లో సినిమా చేయిస్తూ పారితోషకం తీసుకోకుండా వచ్చే లాభాలలో వాటా తీసుకోబోతున్నాడట. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.

ఆది పురుష్, ప్రాజెక్టుకే చిత్రాలు 500 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందుతున్నాయి. కానీ ఆ సినిమాల‌ నేపథ్యానికి అంత అవసరం అయిందట. దాంతో ప్రభాస్ తో చిత్రం అంటే 100 కోట్ల పైనే ఖర్చులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక హర్రర్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అతి తక్కువ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారట. ప్రభాస్ నటించిన చిత్రాలన్నింటిలోకి ఇదే అతి తక్కువ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది. దీనికి ప్ర‌భాస్ మరియు దర్శకుడు మారుతి రెమ్యూనరేషన్ తీసుకోకుండా కేవలం వచ్చే లాభాల్లో వాటాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. వర్కౌట్ అయితే అన్నీ లాభాలే అని ఇన్సైడ్ టాక్. తేడా వ‌స్తే మాత్రం సీన్ రివ‌ర్స్ అవుతుంది.