Read more!

English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న 'ఆదిపురుష్'!

'బాహుబలి'తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. దర్శకుడు ఎవరనే దానితో సంబంధం లేకుండా, ఆయన సినిమాలు భారీస్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్నాయి. అయితే నష్టాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాల థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లోనే వంద కోట్లకు పైగా జరిగింది. కానీ ఆ రెండు సినిమాలు ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇప్పుడు 'ఆదిపురుష్' విషయంలోనూ ప్రభాస్ అభిమానులను అదే భయం వెంటాడుతోంది.

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా రూ.170 కోట్లకు దక్కించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అత్యధికంగా 'ఆర్ఆర్ఆర్' ఏకంగా 200 కోట్ల బిజినెస్ చేయగా, ఆ తర్వాతి స్థానంలో 'ఆదిపురుష్' నిలిచింది. ఓ వైపు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందనే ఆనందం ఉన్నా, మరోవైపు తేడా వస్తే భారీ నష్టాలు తప్పవనే ఆందోళన ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది.

ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాలు ఎనిమిది ఉండగా, అందులో 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి-2' మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించాయి. ఆ రెండు సినిమాలకు రాజమౌళినే దర్శకుడు కావడం విశేషం. ఇక బ్రేక్ ఈవెన్ సాధించని సినిమాలలో ప్రభాస్ నటించిన  'సాహో'(124 కోట్ల బిజినెస్), 'రాధేశ్యామ్'(103 కోట్ల బిజినెస్) కూడా ఉన్నాయి. 'బాహుబలి-2' తర్వాత ఇప్పటికే ప్రభాస్ కి రెండు షాక్ లు తగిలాయి. ఇప్పుడు 'ఆదిపురుష్' ఏకంగా రూ.170 కోట్ల బిజినెస్ చేసింది. మరి ఈ సినిమాతో ప్రభాస్, ఆ నెగిటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సంచలన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.