English | Telugu
మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్.. ఈసారైనా పూజలు అందుకుంటాడా!
Updated : Sep 11, 2023
అప్పట్లో పలువురు తెలుగు హీరోలు పౌరాణిక పాత్రలు పోషించి మెప్పించారు. అయితే ఈ తరంలో పౌరాణిక పాత్రలు పోషించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన అవకాశాలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని వరిస్తున్నాయి. ఇటీవల 'ఆదిపురుష్'లో శ్రీరాముడి పాత్రలో కనిపించారు ప్రభాస్. ఇప్పుడు ఆయనకు శివుడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ నిజంగానే కన్నప్పలో నటిస్తున్నారా? ఒకవేళ నటిస్తే ఏ పాత్రలో కనిపిస్తారు? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఆ వార్తలను స్వయంగా విష్ణు కన్ఫామ్ చేశారు. 'కన్నప్పలో ప్రభాస్' అనే న్యూస్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన విష్ణు.. "హర హర మహాదేవ" అంటూ ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు అందరి దృష్టి కన్నప్పపై పడింది.
అయితే శ్రీరాముడిగా చేసిన 'ఆదిపురుష్', ప్రభాస్ కి ఆశించినంత పేరు తీసుకురాలేకపోయింది. అప్పటివరకు శ్రీరాముడంటే ఒకలా ఉంటాడని భావించిన ప్రేక్షకులకు.. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ వస్త్రధారణ, వర్ణం కొత్తగా ఉండటంతో పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. అప్పట్లో ఎన్టీఆర్ అయితే.. శ్రీరాముడి పాత్రలో ఏకంగా పూజలు అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడు పేరు వింటే దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్టీఆర్ పేరే గుర్తుకు వస్తుంది. అంతలా ఆ పాత్రకు ప్రాణం పోశారు. అయితే ప్రభాస్ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయారనే కామెంట్స్ వినిపించాయి.
ఇప్పుడు ప్రభాస్ కి శివుడి పాత్ర పోషించే అద్భుతమైన అవకాశం వచ్చింది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి వంటి అగ్ర తారలు శివుడి పాత్రలో కనిపించారు. ఈ తరంలో ఆ పాత్రని పోషించే అదృష్టం ప్రభాస్ కి దక్కింది. నిజానికి ప్రభాస్ కటౌట్ కి ఏ పాత్ర వేసినా బాగుంటుంది. ఆయన ఆహార్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటే మాత్రం శివుడిగా పూజలు అందుకుంటారు అనడంలో సందేహం లేదు.