English | Telugu
రివ్యూ .... పీకే
Updated : Dec 19, 2014
హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తున్నాం.. అంటూ మనవాళ్లు విర్రవీగుతుంటారు.
మా సినిమా హాలీవుడ్ సినిమాలా ఉంటుందండీ.. నిజ్జం.. నమ్మండి.. అంటూ మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు.
హాలీవుడ్ అక్కర్లెద్దు. కనీసం బాలీవుడ్ రేంజులో ఆలోచించడానికి మనకు ఇంకో ఇరవై ఏళ్లు పడుతుంది.
ఓ భేజా ఫ్రై, ఓ లంచ్ బాక్స్, ఓ త్రీ ఇడియట్స్, ఓ ఓ మైగాడ్... ఇప్పుడు పీకే!!
స్టార్ హీరో దొరగ్గానే.. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి, దానికి పంచ్ డైలాగులు జోడించి, ఐటెమ్ పాటని దూర్చేసి, విలన్ ఇంట్లో హీరో దూరి నానా యాగీ చేసి, టికెట్టు కొన్న పాపానికి ప్రేక్షకుల్ని రాచి రంపాలు పెట్టి.. ఇదేరా బాబు సినిమా అంటూ ఇంటికి పంపిస్తారు.
పీకే లో మన స్టార్లకన్నా బడా స్టార్ ఉన్నాడు. ఆయనే అమీర్‌ఖాన్.
కానీ మనం చెప్పుకొన్న ఒక్క ఫార్ములా కూడా ఈ సినిమాలో లేదు.
ఆఖరికి ఐటెమ్ సాంగ్‌తో సహా!!
కానీ నవ్వించాడు, ఏడ్పించాడు. బుర్రకు పదునెట్టాడు, కదిపాడు, కదిలించాడు.. అన్నింటికి మించి కొన్ని నేర్పించాడు. అదీ.. పీకే!
ఇది అమీర్‌ఖాన్‌కే సాద్యం అన్నట్టు, రాజ్ కుమార్ హీరాణీ మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయగలడన్నట్టు చేసి చూపించారిద్దరూ. వాళ్లిద్దరికీ హ్యాట్సాప్ చెబుతూ.. కథలోకి వెళ్లిపోదాం.
జగ్గా (అనుష్క శర్మ) ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తుంటుంది. బెల్జియమ్ లో ఉన్నప్పుడు సర్ఫరాజ్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుట్)ని ప్రేమిస్తుంది. తను పాకిస్థాన్‌కి చెందినవాడు. ఇంట్లో వాళ్లు వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోరు. వాళ్లెంతగానో నమ్మే బాబా(సురభ్ శుక్లా) కూడా `సర్ఫ్‌రాజ్ నిన్ను మోసం చేస్తాడు.. కావాలంటే చూడు` అని భవిష్యత్త్ చెబుతాడు. అయితే ఇవేం పట్టించుకోకుండా సర్ఫ్‌రాజ్‌తో పెళ్లికి సిద్ధపడుతుంది. కానీ పెళ్లి సమయానికి సర్ఫ్‌రాజ్ రాడు. మోసపోయానని తెలుసుకొని... ఢిల్లీకి వచ్చేస్తుంది జగ్గా. ఇక్కడ తనకు పీకె (అమీర్‌ఖాన్) తగులుతాడు. అతని ప్రవర్తన చాలా వింతగా, విడ్డూరంగా ఉంటుంది. `దేవుడు కనిపించడం లేదు. కనిపిస్తే.. నాకు చెప్పండి `అంటూ పామ్‌ప్లేట్లు పంచిపెడుతుంటాడు. గుళ్లోకి వెళ్లి.. హుండిలోంచి డబ్బులు లాగేసుకొంటాడు. అదేంటంటే.. `ఓ పని చెప్పా. దేవుడు చేయలేదు.. అందుకే రిఫండ్ తీసుకొంటున్నా.` అంటాడు. ఇంతకీ అతనో గ్రహంతరవాసి. భూమ్మీద ఏముందో తెలుసుకోవాలని వస్తాడు. కానీ.. తిరిగివెళ్లేందుకు అవసరమైన ఓ రిమోట్ ని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు. ఆ రిమోట్ దొరికేలా చేయ్..దేవుడా అంటూ ప్రతి గుడి తిరుగుతుంటాడు. ఈ క్రమంలో భక్తి, దేవుడు, బాబాలపై సెటైర్లు వేస్తాడు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ? అనే చర్చ లేవనెత్తుతాడు. మరింతకీ అతని ప్రయాణం ఏ రీతిన సాగింది?? తన రిమోట్ ఎవరికి దొరికింది?? తను తన గ్రహానికి వెళ్లాడా, లేదంటే ఇక్కడే ఉండిపోయాడా? అసలింతకీ జగ్గా, సర్ఫ్‌రాజ్‌ల ప్రేమ కథ ఏమైంది? ఈ భూమ్మీద గ్రహంతర వాసి సృష్టించిన విన్యాసాలేంటి?? అనేదే పీకే సినిమా.
జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా చూశారా? ఆ సినిమాని రివర్స్ చేయండి. ఆసినిమాలో శ్రీదేవి దివి నుంచి కిందకు దిగుతుంది. స్వర్గానికి ఎంట్రీ ఇచ్చే ఉంగరం పాడేసుకొంటుంది. అందుకోసం అన్వేషణ సాగిస్తుంది. ఇక్కడా అదే ఫార్ములా. కాకపోతే రివర్స్ అయ్యింది. ఈసారి హీరో పై నుంచి దిగుతాడు. తన రిమోట్ దొంగోడు ఎత్తుకెళ్లాడు. ఆ క్రమంలో గ్రహంతర వాసి సాగించిన అన్వేషణ ఈ సినిమా. మన తెలుగు సినిమాలా మాయలూ, మంత్ర తంత్రాలూ.. అంటూ ఫాంటసీ జోలికి వెళ్లకుండా.. కథని జన సామన్యంలోనే తిప్పాడు దర్శకుడు. గ్రహంతర వాసి భూమ్మీద అడుగుపెట్టినప్పటి నుంచీ.. కథ, కథనం స్పీడందుకొంటుంది. పీకెగా అమీర్ విన్యాపాలు చూడాల్సిందే. అమాయకత్వం, మంచితనం... ముఖ్యంగా కనిపించిన ప్రది దేవుడ్నీ గుడ్డిగా ఆరాధించడం.. ఇలాంటి సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.. అప్పుడప్పుడూ కన్నీళ్లు పెట్టిస్తాయి.
పీకే భూమ్మీద అడుగుపెట్టినప్పటి నుంచీ, భోజ్ పురి నేర్చుకొని మనిషిలా ఆలోచించేవారు అతని చేష్టలు, మాటలు అన్నీ కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో ఫస్టాఫ్ సూపర్బ్! తన రిమోట్ కోసం జరిపిన అన్వేషణ.. ఆద్యంతం అలరిస్తుంది. దేవుడు గురించి `రాంగ్ నెంబర్` అంటూ ఓ డిఫరెంట్ చర్చ లేవనెత్తాడు. దేవుడికి ఇన్ని పేర్లెందుకు? ఓ మనిషి ఏ మతం వాడో గుర్తించడం ఎలా? అతనికి ప్రత్యేకమైన గుర్తులున్నాయా? దేవుడికి అందరూ బిడ్డలే కదా, మరెందుకు అందరినీ ఒకలా చూడడు...? ఇలాంటి ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి.
తొలిభాగంలో గ్రహంతర వాసిగా అమీర్ ఖాన్ అమాయకత్వంతో వినోదం పండించిన దర్శకుడు. సెకండాఫ్ లో దేవుడు అన్న పాయింట్ దగ్గర ఆగిపోయాడు. దేవుడున్నాడా, లేడా? ఉంటే ఎక్కడ? అంటూ బాబాతో సాగించిన చర్చ.. కచ్చితంగా ఓమైగాడ్ సినిమాని గుర్తు చేస్తుంది. సెకండాఫ్ మొత్తం... ఓమైగాడ్ కి నకలులా అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఎన్నో విషయాల్ని టచ్ చేసే అవకాశం ఉన్నా, రాజ్ కుమార్ హిరాణీ ఎందుకు దేవుడు అన్న పాయింట్ దగ్గరే ఆగిపోయాడో అర్థం కాదు. అయితే గ్రహాంతర వాసి ఓ ప్రేమకథని కలపడం, భూలోకంలోని తన జ్ఞాపకాలని తన గ్రహానికీ మోసుకుపోవడం వంటి సీన్లతో ఓ హాట్ టచింగ్ ముగింపు ఇచ్చాడు.
అమీర్ ఖాన్.. ఆద్యంతం ఆకట్టుకొన్నాడు. పీకేగా నటించడం, మెప్పించడం, అసలు ఇలాంటి కథ ఎంచుకోవడం తనకే సాధ్యం. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, నడక, చూపులూ అన్నీ డిఫరెంట్‌గా కనిపించాయి. దేవుళ్లందరి విగ్రహాల దగ్గర `నన్ను మా ఇంటికి పంపండి` అని వేడుకొనే సీన్‌లో అమీర్.. సింప్లీ సూపర్బ్. అమీర్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలు రాయి. అనుష్కకి ఇది గ్లామర్ రోల్ కాదు. కేవలం పెర్‌ఫార్మెన్స్ పైనే తనని తాను నిలబెట్టుకొంది. ఇక మిగిలినవాళ్లవందరివీ సపోర్టింగ్‌పాత్రలే. బొమన్ ఇరానీ ఉన్నా సరిగా ఉపయోగించుకోలేదు.
టెక్నికల్‌గా అన్ని శాఖలూ ఒళ్లొంచి పనిచేశాయి. తెరపై అమీర్ విజృంభిస్తే, వెనుక రాజ్‌కుమార్ హిరాణీ హీరో. తొలి భాగంలో ప్రతీ సీన్.. మెప్పిస్తుంది. రాసుకొన్న సంభాషణలూ బాగున్నాయి. సంగీతం కలిసొచ్చింది. నేపథ్య సంగీతం సన్నివేశాల్లో మూడ్ క్రియేట్ చేసింది. కెమెరా పనితనానికి ఎక్కువ మార్కులు పడతాయి. అయితే ద్వితీయార్థం మాత్రం కచ్చితంగా నిరాశ పరుస్తుంది. ఇంట్రవెల్ తరవాత ఈసినిమాపై అంచనాలు, ప్రేమ రెట్టింపవుతాయి. వాటిని నిలబెట్టుకోలేదు దర్శకుడు. ఒకవేళ ఓమైగాడ్ విడుదల కాకపోయి ఉంటే.. సెకండాప్ నీ అంతే ప్రేమిస్తారేమో. మొత్తానికి పీకే అందరికీ నచ్చుతాడు. కథ, కథనాల్లో వైవిద్యం, హీరో - దర్శకుడి ధైర్యం, అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు ఎత్తుకొన్న పాయింట్.. అందరినీ అలరిస్తాయి. కాబట్టి డోన్ట్ మిస్ ఇట్..
రేటింగ్ 3.75