English | Telugu
భార్యతో కలిసి విదేశాలకు పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?
Updated : Oct 28, 2023
తన సతీమణి అన్నా లెజ్నేవాతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విదేశాలకు పయనమయ్యారు. రాజకీయాలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్న పవన్.. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి కారణమేంటి అనుకుంటున్నారా. అందుకు బలమైన కారణముంది.
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. ఇప్పటికే వరుణ్, లావణ్యతో పాటు కొందరు కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు. తాజాగా ఈ వేడుక కోసం భార్యతో కలిసి పవర్ స్టార్ ఇటలీ పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ వేడుకలకు హాజరవ్వడం అరుదు. పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి సమయంలో పవన్ వివాహ వేడుక కోసం విదేశాలకు వెళ్ళడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంత బిజీలోనూ అన్నయ్య కుమారుడి పెళ్ళి కోసం కుటుంబసభ్యుడిగా సమయం కేటాయిస్తున్న పవన్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.