English | Telugu
నేషనల్ క్రష్‌కి ప్యాన్ ఇండియా విషెస్
Updated : Apr 6, 2023
నేషనల్ క్రష్ రష్మికకి ప్యాన్ ఇండియా నుంచి పుట్టినరోజు విషెస్ అందాయి. మన వాళ్లే కాదు, నార్త్ వాళ్లు కూడా ఆమెను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రీసెంట్‌గా కియారా అద్వానీని పెళ్లి చేసుకున్న కొత్త అల్లుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా బిగ్ లవ్ అండ్ హగ్ అంటూ రష్మికకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. 27వ పుట్టినరోజు జరుపుకున్నారు రష్మిక మందన్న. 2016లో కన్నడలో కిరిక్ పార్టీతో జర్నీ మొదలుపెట్టారు రష్మిక.
కాంతార డైరక్టర్ రిషబ్ శెట్టికి డైరక్టర్‌గా అదే తొలి సినిమా. అక్కడ కిరిక్ పార్టీ పెద్ద హిట్ కావడంతో, వెంటనే తెలుగులో అవకాశాలు వచ్చేశాయి. రష్మిక క్రమశిక్షణ, ఆమె కష్టపడే తత్వంతో పాటు, ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతుండటంతో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఒక్కసారి ఇండస్ట్రీలో ఆ పేరు వచ్చేశాక అవకాశాలకు తిరుగేమి ఉంటుంది. నాన్‌స్టాప్‌గా సినిమాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అదే క్రమంలోనే తమిళంలోనూ వరుసగా సినిమాలు చేశారు రష్మిక మందన్న. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకుని, ఫ్యాన్స్ ని మెప్పించేవారు నేషనల్ క్రష్. 2022లో గుడ్ బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ఆ మూవీలో అమితాబ్‌తో రష్మిక చేసిన సన్నివేశాలకు చాలా మంచి స్పందన వచ్చింది. గుడ్ బై తర్వాత ఆమె నటించిన మిషన్ మజ్ను విడుదలైంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. సిద్ధార్థ్‌తో రష్మిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పుష్ప2 పనులతో బిజీగా ఉన్నారు రష్మిక. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అనిమల్‌లోనూ నటిస్తున్నారు. ఇటీవల రెయిన్‌బో అనే సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమాలో దేవ్‌మోహన్‌తో కలిసి నటిస్తున్నారు రష్మిక. మరోవైపు నితిన్ సరసన, వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంది. నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఐపీయల్ ఓపెనింగ్‌లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు నేషనల్ క్రష్.