English | Telugu
ఒకే బ్యానర్ లో వరుసగా మూడో సినిమా!
Updated : Apr 6, 2023
ఇటీవల 'సార్' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. సితార బ్యానర్ లో దర్శకుడిగా వెంకీకి వరుసగా ఇది మూడో సినిమా కావడం విశేషం.
నటుడిగా, రచయితగా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన వెంకీ అట్లూరి.. 2018 లో విడుదలైన 'తొలిప్రేమ' సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ.. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను' చేయగా అది నిరాశపరిచింది. ఈ రెండు సినిమాలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో రూపొందాయి. ఇక తన మూడో సినిమా 'రంగ్ దే'ను సితార బ్యానర్ లో చేశాడు వెంకీ. అయితే ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ అదే బ్యానర్ లో ధనుష్ హీరోగా 'సార్' అనే ద్విభాషా చిత్రం దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు వెంకీ. ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. దీంతో సితారలో వరుసగా మూడో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
నేడు(ఏప్రిల్ 6) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ ప్రకటన వచ్చింది. సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.24 గా ఈ చిత్రం రూపొందనుంది. సోషల్ మీడియా వేదికగా వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాని ప్రకటించిన సితార సంస్థ.. మరో క్వాలిటీ ఎంటర్టైనర్ ని అందిస్తామని హామీ ఇచ్చింది.