English | Telugu
'టైగర్ 3'లో ఎన్టీఆర్ ఇంట్రో.. ఇదెక్కడి ఎలివేషన్ రా మావ!
Updated : Nov 12, 2023
'వార్ 2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'టైగర్ 3' తర్వాత రానున్న చిత్రమిది. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 లో ఎన్టీఆర్ అలరించనున్నాడు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో ఈ నందమూరి హీరో కనిపించనున్నాడు. అయితే 'టైగర్ 3'లోనే ఆ పాత్రని పరిచయం చేయనున్నారని, ఇందులో ఎన్టీఆర్ క్యామియో ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ప్రచారం జరిగినట్టుగా 'టైగర్ 3'లో ఎన్టీఆర్ క్యామియో అయితే లేదు కానీ, 'వార్ 2'లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చారు.
సల్మాన్ ఖాన్ లీడ్ రోల్ చేసిన 'టైగర్ 3' నేడు(నవంబర్ 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్ లో 'వార్ 2'కి లీడ్ ఇచ్చారు. కబీర్(హృతిక్)కి కల్నల్ లూథ్రా(అశుతోష్ రాణా) కాల్ చేసి ఎన్టీఆర్ పాత్రను డెవిల్ కంటే డేంజర్ అన్నట్టుగా పరిచయం చేశాడు. "ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఇండియాకి ఒక కొత్త శత్రుడు ఉన్నాడు. అతను అత్యంత ప్రమాదకరమైన వాడు. అతనికి పేరు లేదు, ముఖం లేదు.. చీకటిలో ఉంటాడు. అతన్ని అడ్డుకోవాలంటే నువ్వు కూడా ఆ చీకటిలోకి వెళ్ళాలి. మరణం కన్నా ప్రమాదకరమైన అతనితో పోరాడాలి. రాక్షసుడి లాంటి శత్రువుని ఎదుర్కొనే క్రమంలో నువ్వూ రాక్షసుడిలా మారిపోతావు" అంటూ లూథ్రా చెప్పుకొచ్చాడు. మొత్తానికి అతని మాటలను బట్టి చూస్తే.. 'వార్ 2'లో ఎన్టీఆర్ పాత్ర ఊహించిన దానికంటే ఎక్కువ పవర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే "ఇదెక్కడి ఎలివేషన్ రా మావ" అంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.