English | Telugu
నాగ చైతన్య కోసం అల్లు అరవింద్ రిస్క్!
Updated : Sep 21, 2023
అక్కినేని మూడో తరం నట వారసుడు అక్కినేని నాగ చైతన్య త్వరలోనే చందు మొండేటి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు తనకు విజయాన్ని అందించింది. అయితే ఆ తర్వాత వచ్చిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు నిరాశ పరిచాయి. అయితే ఈసారి చైతు రొటీన్‌కు భిన్నంగా ఓ జాలరి కథతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో అక్కినేని హీరోకు జతగా సాయి పల్లవి నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు కూడా. లవ్ స్టోరి సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. NC 23 సినిమాను ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించటానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తెలుగు సినిమా మార్కెట్ పెరగటంతో పాటు చైతన్య, సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌తో సినిమాను సౌత్ వరకు బాగానే మార్కెట్ చేసుకోవచ్చునని మేకర్స్ భావించారు. ఇక అన్ని కుదిరితే NC 23ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చైతన్య మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టటం అనేది నిజంగా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే అయితే కూడా నిర్మాత అల్లు అరవింద్ రెడీ అయిపోయారట. దీని కోసం ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్‌తో టై అప్ కూడా అవుతున్నారని కూడా సమాచారం.
ఈ సినిమా కోసం చైతన్య శ్రీకాకుళం యాసను నేర్చుకుంటున్నారు. తండేలు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2018లో 21 మంది జాలర్లు గుజరాత్ తీర ప్రాంతం నుంచి చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కి చిక్కారు. వారిలో రామారావు అనే వ్యక్తికి సంబంధించిన కథతో తండేలు సినిమాను చందు మొండేటి తెరకెక్కిస్తున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతుంది.