English | Telugu

రానా అలా అన్నందుకు బాలయ్య రెండు పీకొచ్చు అంటున్న హరీష్‌ శంకర్‌!

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాదు, రియాలిటీ షోను కూడా తనదైన స్టైల్‌లో హ్యాండిల్‌ చెయ్యగలనని ప్రూవ్‌ చేస్తున్నారు. అందరితోనూ సరదాగా మాట్లాడుతూ, అవసరమైతే సెటైర్లు వేస్తూ అన్‌స్టాపబుల్‌ షో ద్వారా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఈమధ్యకాలంలో ఈ షోకి చాలా పాపులారిటీ వచ్చింది. ఈ షోలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు కూడా ఇంట్రెస్ట్‌ చూపించడం విశేషం. అయితే ఇటీవల ఈ షోలో ఓ సరదా సంఘటన జరిగింది.

అన్‌స్టాపబుల్‌కి సంబంధించి ప్రతి షో ప్రోమోలను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేస్తుంటుంది ఆహా. అలా రిలీజ్‌ చేసిన ఓ ప్రోమో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ ఎపిసోడ్‌లో దగ్గుబాటి రానా పాల్గొన్నాడు. సరదాగా తాను హోస్ట్‌గా వ్యవహరిస్తానని రానా చెప్పడంతో బాలయ్య కూడా దాన్ని పాజిటివ్‌గానే తీసుకొని ఓకే చెప్పారు. అలా మాటల సందర్భంలో బాలయ్యబాబుతో రానా ఓ మాట అన్నాడు. అదేమిటంటే.. ‘భార్యకు భర్త ఐ లవ్‌ యు చెప్పాలి కదా’ అని.. దానికి స్పందించిన బాలయ్య భార్య వసుంధరకు ఫోన్‌ చేసి ‘ఐ లవ్‌ యు’ అని చెప్పారు. దానికి ఆమె కూడా స్పందిస్తూ.. ‘ఐ లవ్‌ యు టూ’ అన్నారు. ఆ తర్వాత ‘నా భార్యకు నాతో ఐ లవ్‌ యు చెప్పించిన నా ఎల్డర్‌ బ్రదర్‌ రానా దగ్గుబాటి’ అంటూ సరదాగా అన్నారు బాలయ్య.

ఆ తర్వాత అన్‌స్టాపబుల్‌ షోకి సుహాసిని, శ్రీయ, దర్శకులు హరీష్‌ శంకర్‌, జయంత్‌ అటెండ్‌ అయ్యారు. ఆ సందర్భంలో బాలయ్య, రానా కలిసి చేసిన షోలో బాలయ్యతో రానా ఐలవ్‌యు చెప్పించిన విషయాన్ని హరీష్‌ శంకర్‌ ప్రస్తావిస్తూ.. ‘రానా అంత రిస్క్‌ తీసుకొని మీతో అలా చెప్పించినందుకు మీరు రెండు పీకినా పీకొచ్చు’ అన్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ ప్రోమోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ పెట్టారు. అయితే రానా మాత్రం ఆ ప్రోమోలో హరీష్‌ శంకర్‌ అన్న మాటలకు రిప్లయ్‌ ఇస్తూ ‘అలా అన్నందుకు నిన్ను పీకాలి’ అని పోస్ట్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తూ రానాకు మద్దతు తెలియజేస్తూ చాలా కామెంట్లు, ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

దీన్ని బట్టి బాలయ్య నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యిందీ.. ఎంత రెస్పాన్స్‌ వస్తోంది అనే విషయం అర్థమవుతుంది. ప్రతి ఎపిసోడ్‌ను ఎంతో హుందాగా, సరదాగా, ఫన్నీగా నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు బాలయ్యబాబు. ఈ షోకి అంత క్రేజ్‌ వచ్చిందంటే బాలయ్య టైమింగ్‌, గెస్ట్‌లను హ్యాండిల్‌ చేసే విధానమే కారణం.