English | Telugu

నాన్న సినిమా ఫ్లాప్ అన్న నాగార్జున‌

మా సినిమా హిట్టో హిట్టో అని డ‌బ్బా కొట్టుకోవ‌డం అంద‌రికీ అల‌వాటే. రెండో రోజు తిరిగొచ్చిన డ‌బ్బా సినిమాల్ని కూడా ఇప్ప‌టికీ భుజానెత్తుకొంటుంటారు. కానీ నాగ్ మాత్రం ఆ టైపు కాదు. భాయ్ సినిమా అంటే ఇప్ప‌టికీ భ‌య‌ప‌డిపోతున్నా.. అని చాలాసార్లు చెప్పాడు. అయితే అదేంటో ఇప్పుడో హిట్టు సినిమాని కూడా ఫ్లాప్ లిస్టులో చేర్చేశాడు. అది.. రాముడు కాదు కృష్ణుడు. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ హిట్టే. అందులోని ఒక‌లైలా కోసం - తిరిగాను దేశం అనే పాట‌లో ప‌దాన్ని నాగ‌చైత‌న్య సినిమా కోసం టైటిల్‌గా వాడుకొన్నారు. ఆ పాట‌నీ రీమిక్స్ చేశారు. ఈ సినిమా 17 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. అలాంటి సినిమాని ప‌ట్టుకొని నాగ్ ఫ్లాప్ అనేశాడు. ''ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్ కుమార్ ఒక లైలా కోసం అనే టైటిల్ చెప్పిన‌ప్పుడు భ‌య‌ప‌డ్డా. ఎందుకంటే రాముడు కాదు కృష్ణుడు సినిమాలోని పాట‌ది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అందులోని పాట వాడుకోవ‌డం ఎందుకు అనిపించింది..'' అని చెప్పాడు. 17 సెంట‌ర్ల‌లో వంద రోజులు ఆడిన సినిమా ఫ్లాప్ అన‌డం ఏమిటో అక్క‌డున్న పాత్రికేయుల‌కు అర్థం కాలేదు. మొత్తానికి నాగ్ చాలా డిఫ‌రెంట్ అనే విష‌యం ఈ వ్యాఖ్య‌తో మ‌రోసారి రుజువైంది. కాక‌పోతే హిట్టు సినిమాని ఫ్లాప్ అన‌డం మాత్రం అక్కినేని అభిమానుల్ని ఇబ్బంది పెట్టేదే!