English | Telugu
మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ
Updated : Aug 6, 2023
'సీతారామం' మూవీతో సీతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బెంగాలీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అప్పటికే బెంగాలీ, హిందీలో సినిమాలు చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తనదైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అదే క్రేజ్‌తో ఇప్పుడు నాని 30వ సినిమా హాయ్ నాన్నలో నటిస్తోంది. అలాగే పరశురాం దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలోనూ మృణాల్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా తాజాగా ఈ అమ్మడు తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. గ్లామర్ పరంగానే కాదు, పెర్ఫామెన్స్‌తోనూ ఆకట్టుకోవటంతో మృణాల్ స్టైలే వేరు. ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆమె ఆకట్టుకుంటుందని భావించిన ఓ స్టార్ డైరెక్టర్ అండ్ హీరో ఆమెను తమ సినిమాలోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ స్టార్ దర్శకుడు, కథానాయకుడు ఎవరో కాదు.. డైరెక్టర్ ఏమో ఎ.ఆర్.మురగదాస్, హీరో ఏమో శివ కార్తికేయన్.
గజిని నుంచి దర్బార్ వరకు ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఎ.ఆర్.మురగదాస్ త్వరలోనే శివ కార్తికేయన్‌తో సినిమాను చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రీసెంట్‌గా మృణాల్ ఠాకూర్ లుక్ టెస్ట్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ ఏడాది చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం అవనుంది.
ఇప్పుడిప్పుడే శివ కార్తికేయన్ తమిళంతో పాటు తెలుగు మార్కెట్‌పై పట్టు సాధించుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఆయనకు తమిళ మార్కెట్‌కు అనుగుణంగా తెలుగులో సాలిడ్ మూవీ పడితే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మురగదాస్ సినిమాతో తనకు తెలుగులో మార్కెట్ ఓపెన్ అవుతుందని శివ కార్తికేయన్ భావిస్తున్నారు.