English | Telugu

మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటున్న మేఘ‌నా రాజ్

సౌత్ స్టార్ మేఘనా రాజ్ సర్జా మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అయ్యారు. ఆమె భ‌ర్త చిరంజీవి స‌ర్జా 2020 లో గుండెపోటుతో క‌న్నుమూశారు. అప్ప‌టి నుంచీ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు మేఘ‌న‌. చిరంజీవి స‌ర్జా క‌న్నుమూసే స‌మయానికి మేఘ‌న గ‌ర్భ‌వ‌తి. రాయ‌న్ రాజ్ స‌ర్జాకి జ‌న్మనిచ్చి, బాబు ఆల‌నాపాల‌నా చూసుకుంటున్నారు. అయితే ఎన్నాళ్లు అలా ఉండాల‌ని అనుకున్నారేమో, త‌న రీ ఎంట్రీని ప్ర‌క‌టించారు. త‌త్స‌మ త‌ద్భ‌వ - ది క‌న్ఫెష‌న్‌లో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేఘ‌న‌.

దీని గురించి మేఘ‌న మాట్లాడుతూ ``ఎప్పుడు ఎవ‌రిని క‌లిసినా ఒక‌టే మాట అడిగేవారు. న‌న్ను మ‌ళ్లీ వెండితెర‌మీద చూసే రోజు ఎప్పుడూ.. అని! అలాంటివారికోస‌మే ఉత్సాహంతో ఇక్క‌డ రాస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం త‌త్స‌మ తద్భ‌వ‌. న‌టిగా నేను రీ ఎంట్రీ ఇస్తున్నాను భ‌యంలో చిక్కుకున్న‌ప్పుడు, నిర్భ‌యంగా ఉండ‌టం మాత్ర‌మే ఆమెకు ఏకైక మార్గం`` అంటూ త‌త్స‌మ తద్భ‌వ‌లో త‌న రోల్ గురించి చెప్పుకొచ్చారు. త‌త్స‌మ త‌ద్భ‌వ పోస్ట‌ర్‌ ను య‌ష్ స‌తీమ‌ణి రాధికా పండిట్ కూడా షేర్ చేశారు. ఫొటో షేరింగ్ యాప్‌లో షేర్ చేస్తూ, ``ఉత్కంఠ‌భ‌రితంగా అనిపిస్తోంది పోస్ట‌ర్‌. మేఘ‌న‌కు మంచి కంబ్యాక్ అవుతుంది. ప్రేక్ష‌కులు ఆమెను తెర‌పై చూడ‌టానికి ఎదురుచూస్తున్నారు`` అని రాసుకొచ్చారు.

విశాల్ ఆత్రేయ తెర‌కెక్కించిన సినిమా ఇది. వాసుకి వైభ‌వ్ సంగీతం అందించారు. శ్రీనివాస్ రామ‌య్య కెమెరాను హ్యాండిల్ చేశారు.చిరంజీవి స‌ర్జాతో సినిమా చేయాల‌న్న‌ది ప‌న్న‌గాభ‌ర‌ణ సంక‌ల్పం. అయితే, అది కుద‌ర‌క‌పోవ‌డంతో ఆయ‌న భార్య‌తో ఈ ప్రాజెక్టు తీసిన‌ట్టు తెలిపారు.త‌న జీవితం నుంచి చిరంజీవి వెళ్లిపోయాక కూడా అత‌ని జ్ఞాపకాల‌తోనే జీవిస్తున్నారు మేఘ‌న‌. ప్ర‌తినిత్యం త‌న జీవితంలో చోటుచేసుకునే విష‌యాల‌ను సోషల్ మీడియా ద్వారా చిరంజీవి అభిమానుల‌తో పంచుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఆమె పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన స్పందన‌ వ‌స్తోంది.