English | Telugu
శివుని ఆజ్ఞ.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడు!
Updated : Mar 6, 2023
మంచు మనోజ్ కుమార్, భూమా మౌనిక రెడ్డి మార్చి 3న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇద్దరికీ రెండో వివాహం. గతంలో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్ మనస్పర్థల కారణంగా విడిపోగా.. మౌనిక సైతం తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మనోజ్, మౌనిక ఎన్నో ఏళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మౌనిక మొదటి పెళ్ళికి మనోజ్ గెస్ట్ గా సైతం హాజరవ్వడం విశేషం. ఆ తర్వాత ఇద్దరు తమ వైవాహిక జీవితాలకు ముగింపు పలికాక.. వీరి మధ్య స్నేహం మరింత బలపడి, అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.
తాజాగా ఈ కొత్తజంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, మౌనిక కుమారుడు కూడా ఉన్నారు. తిరుమలతో ఆ బాబుని మనోజ్ ఎత్తుకొని, ఎంతో ప్రేమగా చూసుకోవడం చూస్తుంటే.. వారి మధ్య ఎంతో అనుబంధం ఉందని అర్థమవుతోంది. అంతేకాదు ఇదంతా శివుడు ఆజ్ఞ అని, కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటూ మనోజ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.
శ్రీవారి దర్శనం తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. "జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఎప్పటికీ ఓడిపోకూడదు. ఈరోజు ఆ ప్రేమే గెలిచింది. మా తల్లిదండ్రులు, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదు.. కానీ ప్రజలకు సేవ చేయాలని ఉంది. ఆ ఆలోచనలే మా ఇద్దరినీ కలిపాయి. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. 12 సంవత్సరాల నుంచి తెలుసు మేము. గత నాలుగేళ్లుగా నేనొక లోకంలో ఉండగా.. మౌనికనే నన్ను బయటకు తీసుకొచ్చింది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మేం బలంగా నిలబడ్డాం. ప్రేమ గురించి, బాబు గురించి ఆలోచించి.. నాలుగేళ్లుగా ఎదురుచూశాం. శివుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. బాబు నా జీవితంలోకి రావడం కూడా శివుని ఆజ్ఞే. కలిసొచ్చే కాలమొస్తే, నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటారు కదా.. అది ఇదేనేమో" అన్నారు.