English | Telugu

వింటేజ్‌ వైబ్స్‌.. ఫ్యాన్స్‌ పల్స్‌ పట్టేసిన అనిల్‌ రావిపూడి!

వరస హిట్స్‌ దూసుకెళ్తున్న అనిల్‌ రావిపూడి తాజాగా మెగాస్టార్‌ చిరంజీవితో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ పేరుతో ఫుల్‌ పెడ్జ్‌డ్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మెగాస్టార్‌ కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చిరంజీవి కామెడీ టైమింగ్‌ అనేది ప్రస్తుతం ఉన్న టాప్‌ హీరోలెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. గతంలో ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్‌ సీన్స్‌లో ఎంత అలరించారో కామెడీని పండించడంలోనూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక అనిల్‌ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మెగాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అనిల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఓ కొత్త విశేషం మనకు కనిపిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రంలో ‘మీసాల పిల్లా..’ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటను ఉదిత్‌ నారాయణ్‌ పాడడం విశేషం. గతంలో చిరంజీవి చేసిన చాలా సినిమాల్లో ప్లేబాక్‌ పాడారు ఉదిత్‌. రామ్మా చిలకమ్మా, వానా వానా, కైకలూరి కన్నెపిల్లా.. వంటి సూపర్‌హిట్‌ సాంగ్స్‌ పాడిన ఉదిత్‌ను మళ్ళీ ఈ సినిమా కోసం తీసుకొచ్చారు అనిల్‌. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ‘గోదారి గట్టు మీద..’ పాటను రమణ గోగులతో పాడించడం ద్వారా ఓ కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో తెలుగు పాటలు పాడని ఉదిత్‌ నారాయణ్‌ను ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం కోసం తీసుకొచ్చారు. ఈ పాట కూడా గతంలో చిరంజీవికి పాడిన పాటల తరహాలోనే ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చిరంజీవి స్టెప్స్‌ కూడా తోడైతే వచ్చే సంక్రాంతికి మరో సూపర్‌హిట్‌ సాంగ్‌ సందడి చేసే అవకాశం ఉంది. తన సినిమాల్లో వింటేజ్‌ సింగర్స్‌ని తీసుకు రావడం ద్వారా ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు అనిల్‌ రావిపూడి.