English | Telugu
'మళ్ళీ పెళ్లి' కాదిది.. పవిత్రమైన నరేష్ బయోపిక్!
Updated : Apr 21, 2023
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పేర్లు కొంతకాలంగా తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. నరేష్, పవిత్ర పెళ్ళికి సిద్ధపడటం.. వారిపై నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి తీవ్ర విమర్శలు చేయడం వంటివి అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ గొడవల మధ్య 'మళ్ళీ పెళ్లి' అంటూ కొత్త సినిమాని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు నరేష్-పవిత్ర. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు.
'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తుంటే 'కథ కాదిది.. నరేష్, పవిత్రల బయోపిక్' అన్నట్టుగా ఉంది. నిజ జీవితంలో ఎలాగైతే నరేష్-పవిత్ర కలిసి ఉండటం, రమ్య రఘుపతి గొడవ చేయడం వంటివి జరిగాయో అలాంటి సన్నివేశాలే టీజర్ లో కనిపిస్తున్నాయి. రమ్య ప్రెస్ మీట్ లో తన భర్త మోసం చేశాడని, తనకి తన కొడుకు జీవితమే ముఖ్యమని చెప్పడం మొదలుకొని.. నరేష్-పవిత్ర హోటల్ లో ఉండగా పోలీసులను తీసుకొని రమ్య అక్కడికి వెళ్లడం, ఆమెని చూసి నరేష్ విజిల్ వేయడం వంటివన్నీ టీజర్ లో దర్శనమిచ్చాయి. మరి 'మళ్ళీ పెళ్లి' పేరుతో తమ జీవితంలో జరిగిన సంఘటనలనే సినిమాగా తీసుకొస్తున్న నరేష్, పవిత్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ఈ చిత్రం మేలో విడుదల కానుంది.