English | Telugu
'ఆదిపురుష్' చూడటానికి నిజంగానే హనుమంతుడు వచ్చాడు!
Updated : Jun 16, 2023
'ఆదిపురుష్' సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లోనూ హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనే నమ్మకాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ 'ఆదిపురుష్' ప్రదర్శితమవుతున్న థియేటర్ లో నిజంగానే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.
హిందువులు వానరాన్ని హనుమంతుడిగా భావిస్తారు. అందుకే 'ఆదిపురుష్' ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ కి వానరం రావడంతో సాక్షాత్తు ఆ హనుమంతుడే వచ్చాడని అందరూ సంబరపడుతున్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఒక థియేటర్ లో ఆదిపురుష్ షో నడుస్తుండగా అక్కడికి ఒక వానరం వచ్చి వెండితెరపై రామ కథను చూస్తూ కూర్చుంది. అది గమనించిన ప్రేక్షకులు ఒక్కసారిగా 'జై శ్రీరామ్', 'జై హనుమాన్' అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు కొందరు వానరం ఆదిపురుష్ థియేటర్ లో సందడి చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. రామ భక్తులు, ఆంజనేయ భక్తులు అయితే నిజంగానే ఆ హనుమంతుడే 'ఆదిపురుష్' సినిమా చూడటానికి వచ్చాడని మురిసిపోతున్నారు.