English | Telugu
లోకేష్ టార్గెట్ వెయ్యి కోట్లు!
Updated : Oct 31, 2023
తెలుగు, హిందీ, కన్నడ సినీ పరిశ్రమలకు రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ తమిళ పరిశ్రమ ఇంతవరకు ఆ ఫీట్ సాధించలేదు. కోలీవుడ్ కి చెందిన అట్లీ డైరెక్ట్ చేసిన 'జవాన్' రూ.1000 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ అది హిందీ సినిమా. దీంతో కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమాని అందించే దర్శకుడు లోకేష్ కనగరాజ్ అవతాడనే చర్చ నడుస్తోంది.
కేవలం ఐదు సినిమాలతోనే తమిళ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు లోకేష్. 2017 వేసవిలో విడుదలైన 'మానగరం'తో లోకేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కార్తీ హీరోగా 'ఖైదీ' అనే యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించి ఘన విజయం సాధించాడు. లోకేష్ మొదటి చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూలు చేయగా, 'ఖైదీ' ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత లోకేష్ సినిమా సినిమాకి వసూళ్లు పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. విజయ్ తో చేసిన 'మాస్టర్' రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రకటించి 'ఖైదీ'ని లింక్ చేస్తూ చేసిన 'విక్రమ్' ఏకంగా రూ.450 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఆ యూనివర్స్ లో భాగంగానే రూపొందిన 'లియో' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రూ.500 కోట్లకు పైగా రాబట్టి రూ.600 కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో తదుపరి సినిమాతో లోకేష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడనే ఆసక్తి నెలకొంది.
లోకేష్ తన తదుపరి సినిమాని రజినీకాంత్ తో చేయనున్నాడు. అత్యధిక వసూళ్ళు రాబట్టిన తమిళ చిత్రాల లిస్టులో టాప్-2 లో రజినీకాంత్ సినిమాలే ఉండటం విశేషం. '2.0', 'జైలర్' సినిమాలతో రెండు సార్లు రూ.600 కోట్ల ఫీట్ సాధించాడు రజినీ. ఇప్పుడు రజినీకి లోకేష్ తోడైతే వెయ్యి కోట్లు రాబట్టడం పెద్ద విషయేమీ కాదు. మరి వీరి కాంబినేషన్ కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమాని అందిస్తుందేమో చూడాలి.