English | Telugu
‘లియో’ సెన్సార్ రిపోర్ట్.. రెచ్చిపోతున్న విజయ్ ఫ్యాన్స్
Updated : Oct 11, 2023
గత కొన్నిరోజులుగా ఎక్కడా చూసినా ‘లియో’ సినిమా గురించే డిస్కషన్. అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, రోజురోజుకీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈమధ్యే రిలీజ్ అయిన ట్రైలర్‌కి డివైడ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో థియేటర్స్‌ని ధ్వంసం చేసిన ఘటనని కూడా మనం చూశాం. ఈ సినిమా అంటే ఇంత క్రేజ్ ఏర్పడటానికి ముఖ్య కారణం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇంతకుమందు అతను చేసిన సినిమాలు భారీ విజయం సాధించడంతో తమ అభిమాన హీరో విజయ్‌తో లోకేష్ ఎలాంటి సినిమా తీశాడనే ఆసక్తి వారిలో ఎక్కువైపోయింది. అలాగే ఈ సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించడం, విజయ్ రెండు విభిన్నమైన పాత్రలు పోషించడంకూడా కారణాలు అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ‘లియో’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్‌గా రావడంతో ఇక విజయ్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు.
ఇక సెన్సార్ రిపోర్ట్ ఎలా వుందో పరిశీలిద్దాం.. ఈ సినిమాను చూసిన సెన్సార్ వారు పాజిటివ్ రిపోర్ట్ చెప్పారని తెలుస్తోంది. అయితే సినిమాలో కొన్ని మార్పులు సూచించారట. అంతేకాదు, ట్రైలర్ చూపించిన ఒక బూతు డైలాగ్‌ను మ్యూట్ చెయ్యమని చెప్పారట. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఇంటరెస్టింగ్ నేరేషన్‌తో సినిమా సాగిందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని సమాచారం. ఇక అనిరుధ్ మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారట. ఈ మూవీ నిడివి గం. 2.44 లుగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమా ఔట్‌పుట్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సినిమాకి మంచి హైప్‌ని ఇచ్చాయి.