English | Telugu
త్రివిక్రమ్ మాస్ జాతర.. 'అరవింద సమేత'కు ఐదేళ్ళు
Updated : Oct 11, 2023
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'అరవింద సమేత వీర రాఘవ'. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా 2018 అక్టోబర్ 11న విడుదలై ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ అప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ ఫిల్మ్ విడుదలై నేటితో ఐదు వసంతాలు పూర్తయింది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన మొదటి సినిమా కావడంతో 'అరవింద సమేత'పై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు త్రివిక్రమ్. ప్రత్యర్థుల దాడిలో తండ్రి, మామ చనిపోతే.. అప్పటిదాకా హింస ఎరుగని హీరో ఒక్కసారిగా తిరగబడిన సన్నివేశం కట్టిపడేసింది. ఆ సీన్ లో ఎమోషన్, యాక్షన్ చక్కగా కుదిరాయి. ఎన్టీఆర్ ని సిక్స్ ప్యాక్ లో చూపించిన తీరు కూడా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది. ఇక ఎన్టీఆర్ ఒక్క ఫోన్ కాల్ తో ప్రత్యర్థులకు చావు భయాన్ని కలిగించే సన్నివేశం కూడా హైలైట్ గా నిలిచింది. ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరున్న త్రివిక్రమ్ తనలోని అసలు సిసలైన మాస్ ని చూపిస్తూ ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలను అద్భుతంగా రూపొందించాడు. ఎన్టీఆర్ కూడా తండ్రి పోయిన బాధని సినిమా ప్రారంభం నుంచి చివరివరకు కళ్ళలో చూపిస్తూ అద్భుతంగా నటించాడు. అలా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి చేసిన ఈ మ్యాజిక్ ప్రేక్షకులకు నచ్చి ఘన విజయాన్ని అందుకుంది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, ఈశ్వరీరావు, సునీల్, నవీన్ చంద్ర, నరేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి.