English | Telugu

ఆ పెళ్లితో బంధువులుగా మారనున్న కీరవాణి, మురళీమోహన్‌!

సినిమా రంగంలో ఉన్నవారు ఆ రంగంలోని వారినే పెళ్లి చేసుకోవడం లేదా వియ్యమందుకోవడం సర్వసాధారణంగా జరిగే విషయాలే. అలా ఇప్పుడు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, నటుడు మురళీమోహన్‌ ఒక పెళ్ళితో బంధువులుగా మారుతున్నారు. మీడియాలో ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో మురళీమోహన్‌ తన మనవరాలి పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చారు. తన మనవరాలు కీరవాణి ఇంటి కోడలు కాబోతున్న మాట వాస్తవమేనని మురళీమోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాకు కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి విదేశాల్లో సెటిల్‌ అయ్యింది. ఆమెకు ఒక కూతురు ఉంది. 2024 ఫిబ్రవరిలో ఆ అమ్మాయి వివాహం చేయబోతున్నాం. అలాగే కొడుకుకు కూడా ఒక కుమార్తె ఉంది. ఆమెకు కూడా పెళ్లి కుదిరింది. కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. వచ్చే ఏడాది చివర్లో ఈ వివాహం జరుగుతుంది’’ అని వివరించారు. మురళీమోహన్‌ కుమారుడి పేరు రామ్‌మోహన్‌రావు. ఈయన ఏకైక కుమార్తె పేరు రాగ. ఆమె బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది.

సింహ కోడూరి హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా యమదొంగ, మర్యాద రామన్న చిత్రాల్లో నటించిన సింహ కోడూరి మత్తు వదలరా మూవీతో హీరోగా మారాడు. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ వంటి డిఫరెంట్‌ మూవీస్‌లో నటించినప్పటికీ సింహాకు బ్రేక్‌ రాలేదు. ఇక సింహా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. తండ్రి యం.యం.కీరవాణి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. తల్లి శ్రీవల్లి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌. పెద్ద కొడుకు భైరవ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. ఆస్కార్‌ వేదిక మీద ‘నాటు నాటు’ సాంగ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తో పాటు ఆలపించారు కాలభైరవ.