English | Telugu
రాజమౌళినిని ఇరికించిన కరణ్‌జోహార్
Updated : Jun 2, 2015
బాహుబలి విడుదల విషయంలో రాజమౌళికే ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జులై 10న ముహూర్తం ఫిక్స్ చేసుకొన్నా... ఈలోగా అవుతుందా? లేదా? అనే అనుమానాలున్నాయి. ఆడియో వేడుక పూర్తయ్యాక.. అప్పుడు విడుదల తేదీ ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. రిలీజ్‌డేట్ మార్చుకొంటూ వెళితే.. అభిమానులు గందరగోళానికీ నిరుత్సాహానికి గురవుతారని రాజమౌళి భయం. అయితే హిందీ రైట్స్ కొనుక్కొన్న కరణ్‌జోహార్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళిని తెగ ఇబ్బంది పెడుతున్నట్టుటాక్. సోమవారం ముంబైలో బాహుబలి హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. ఆసమయంలో వేదికపై కరణ్‌జోహార్ బాహుబలిని జులై 10నే విడుదల చేస్తున్నాం అని అందరి ముందూ ప్రకటించేశాడు. దాంతో రాజమౌళిలో టెన్షన్ పెరిగిపోయింది. అన్నీ పక్కాగా చూసుకొని రిలీజ్ డేట్ ప్రకటిద్దామనుకొంటే కరణ్ జోహార్ మాట మాత్రం కూడా చెప్పకుండా జులై 10న రిలీజ్ చేసేస్తాం.. అని చెప్పడం రాజమౌళిని ఇబ్బందుల్లో నెట్టినట్టయ్యింది. బాహుబలిని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో విడుదలలు వాయిదా పడుతుంటాయి గానీ, బాలీవుడ్‌లో మాత్రం `వాయిదా` అనేది అరుదుగా జరిగే విషయం. రెండు నెలల ముందే విడుదల తేదీ ఫిక్స్ చేసుకొంటారక్కడ. అందులో మార్పులేం ఉండవు. అంటే... జులై 10న రాజమౌళి ఎట్టిపరిస్థితుల్లోనూ బాహుబలి విడుదల చేయాల్సిందే అన్నమాట. మన జక్కన్న ను కరణ్‌జోహార్ అంతలా ఇరికించాడు మరి.