English | Telugu

పెన్ను ప‌డుతున్న క‌మ‌ల్‌హాస‌న్‌

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ మ‌ళ్లీ పెన్ను ప‌వ‌ర్ చూపించ‌బోతున్నారు. మ‌ర‌లా ఆయ‌న స్క్రీన్ రైట‌ర్‌గా అవ‌తార‌మెత్త‌నున్నారు. రెయిజ్ టు రూల్ అంటూ హెచ్‌.వినోద్ డైర‌క్ష‌న్‌లో తాను చేస్తున్న సినిమా గురించి ఆల్రెడీ ప్ర‌క‌టించారు క‌మ‌ల్‌హాస‌న్‌. ఆయ‌న న‌టిస్తున్న 233వ సినిమా ఇది. రాజ్ కమ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ట‌ర్మ‌రిక్ మీడియా స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ సినిమాకు స్టోరీ రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు క‌మ‌ల్ హాస‌న్‌.

డ్యాన్సింగ్‌, సింగింగ్‌, సాంగ్ రైటింగ్‌, మేక్ అప్‌, డైర‌క్ష‌న్ అంటూ క‌మ‌ల్‌హాస‌న్‌కి తెలియ‌ని విద్య లేదు. ఆయ‌న చివ‌రి సారిగా విశ్వ‌రూపం 2కి రైట‌ర్‌గా, డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత రైట‌ర్‌గా చేయ‌లేదు. ఇప్పుడు హెచ్‌.వినోద్ డైర‌క్ష‌న్‌లో చేస్తున్న సినిమాకు క‌థ అందిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, డైలాగులు హెచ్‌.వినోద్ రాసుకుంటున్నారు.

క‌మ‌ల్‌హాస‌న్ దీని గురించి మాట్లాడుతూ "కొత్త జ‌న‌రేష‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల నాకు తెలిసిన‌వి వారికి చెబుతాను. వారి నుంచి కొత్త‌గా నేను నేర్చుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. క్రియేటివిటీ, నేర్చుకోవాల‌నే త‌ప‌న‌, క‌మిట్‌మెంట్ హెచ్‌.వినోద్‌లో ఎక్కువ‌గా ఉంది. ఆయ‌న సినిమాల‌ను గ‌మ‌నిస్తే సామాజిక స్పృహ‌తో ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్‌గానూ ఆడుతున్నాయి. అందుకే నేను ఈ సినిమా చేస్తున్నాను. మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న 52వ సినిమా ఇది. నేను ఈ సినిమాకు క‌థ రాస్తున్నాను" అని అన్నారు.

హెచ్‌.వినోద్ మాట్లాడుతూ "ఇది నాకు చాలా స్పెష‌ల్ ప్రాజెక్ట్. క‌మ‌ల్ గారి క‌థ‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ఫిల్మ్ మేకింగ్ ఆర్ట్ ని ఇంకా అందంగా అర్థం చేసుకోగ‌లుగుతున్నాను. ఆయ‌న నుంచి చాలా స్ఫూర్తి పొందుతున్నాను. యంగ్ జ‌న‌రేష‌న్ ఆయ‌న్ని చూసి చాలా నేర్చుకోవాలి" అని అన్నారు.