English | Telugu
సూపర్ స్టార్ సోదరిగా జీవిత రాజశేఖర్!
Updated : Mar 1, 2023
'3' సినిమాతో దర్శకురాలిగా పరిచయమై ఆకట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ప్రస్తుతం 'లాల్ సలాం' అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జీవిత రాజశేఖర్ కూడా నటించనున్నారు.
'లాల్ సలాం'లో రజినీకాంత్ సోదరిగా జీవిత కనిపించనున్నారు. ఇది సినిమాకి చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవిత.. నటిగా వెండితెర మీద కనిపించి చాలా కాలమైంది. చివరిగా 1990 లో విడుదలైన 'మగాడు' చిత్రంలో నటించిన ఆమె.. రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు దూరమయ్యారు. ఇప్పుడు ఏకంగా మూడు దశాబ్దాల తర్వాత ఆమె కెమెరా ముందుకు రాబోతున్నారు. 'లాల్ సలాం'లో సూపర్ స్టార్ సోదరిగా నటిస్తున్న జీవిత.. మార్చి 7 నుంచి చెన్నైలో జరగనున్న షూటింగ్ లో పాల్గొననున్నారు. మరి 'లాల్ సలాం' నుంచి మళ్ళీ వరుస సినిమాల్లో నటిస్తూ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లాల్ సలాం' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.