English | Telugu
బిగ్ షాక్.. 'సలార్' మళ్ళీ వాయిదా?
Updated : Nov 6, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్' ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవ్వడంతో.. ఈ ఏడాది సెప్టెంబర్ 28 కి పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత సీజీ వర్క్ కారణంగా విడుదల తేదీ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22 కి మారింది. అయితే ఇప్పుడు ఈ తేదీకి కూడా సలార్ రావడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హిందీ సినిమా 'డంకీ' డిసెంబర్ 22న విడుదల కానుంది. 'పఠాన్', 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఈ ఏడాది షారుఖ్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం, పైగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించడంతో 'డంకీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి పోటీగా విడుదల చేస్తే ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సలార్ టీమ్.. మళ్ళీ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరికొందరేమో కొన్ని సీన్ల రీషూట్ లు, సీజీ వర్క్ కారణంగా సలార్ ఆలస్యమవుతుందని.. డిసెంబర్ 22 కి విడుదల కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే సలార్ మళ్ళీ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మూవీ టీమ్ కి చెందిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొందరు కావాలనే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 22నే విడుదలవుతుందని అంటున్నారు. పోటీలో ఏ సినిమా ఉన్నా తగ్గేదేలే అని, 'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా సలార్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.