English | Telugu
అప్పటి 'బాషా'నే ఇప్పటి 'ఓజీ'నా!
Updated : Sep 5, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో 'బాషా' ఒకటి. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ సూపర్ స్టార్ రేంజ్ ని ఎన్నో రెట్లు పెంచింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో సత్య మూవీస్ నిర్మించిన ఈ సినిమా 1995 జనవరిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. "ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు" అంటూ మాణిక్ బాషాగా రజినీకాంత్ విశ్వరూపం చూపించారు. సినిమా వచ్చి 28 ఏళ్ళు దాటినా బాషా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో ఈ కథనే కాస్త మార్పులు చేసి, సినిమా తీసి బ్లాక్ బస్టర్లు అందుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సైతం 'బాషా' నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నట్లు అనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ'. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పవర్ స్టార్ బాక్సాఫీస్ ఊచకోత కోయడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకి, 'బాషా' సినిమాకి చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.
'బాషా'లో రజినీ డాన్ కాగా, 'ఓజీ'లో పవన్ కూడా డాన్ గా కనిపించనున్నారు. 'బాషా'లో రజినీ పాత్ర ముందుగా ఆటో డ్రైవర్ మాణిక్యంగా పరిచయమవుతుంది. ఆ తర్వాత ముంబై నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ లో మాణిక్ బాషా అనే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. ఇక 'ఓజీ' విషయానికొస్తే ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో "అప్పట్లో ముంబైలో రక్తపాతం సృష్టించిన అతను.. మళ్ళీ తిరిగొస్తున్నాడు" అంటూ పవన్ పాత్రని పరిచయం చేశారు. అంటే బాషా తరహాలోనే ఓజీలో కూడా హీరో ముంబైలో గ్యాంగ్ స్టర్ గా తన హవా చూపించి.. ఆ తర్వాత కొంతకాలం వేరే ప్రాంతానికి వెళ్లి మళ్ళీ తిరిగొస్తాడు. అంతేకాదు పవన్ లుక్, ఆయన గ్యాంగ్, పలు పోస్టర్స్ కూడా 'బాషా'నే గుర్తుచేస్తున్నాయి. మరి 'బాషా'ను గుర్తుచేస్తున్న ఈ 'ఓజీ' ఫిల్మ్ రిజల్ట్ కూడా బాషా రేంజ్ లో ఉంటుందేమో చూడాలి.