English | Telugu

రెండు నెలలు షూటింగ్‌కు దూరం కానున్న శ్రీలీల.. ఎందుకంటే?

డాక్టర్‌ అవుదామనుకొని యాక్టర్‌ అయ్యాను అని చాలామంది హీరోలు, హీరోయిన్లు చెబుతుంటారు. అనుకోవడం వేరు, డాక్టర్‌ కోర్సు చదువుతూ సినిమాల్లో కూడా నటించడం వేరు. అలాంటి హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నారు. ఒకరు సాయిపల్లవి. మరొకరు శ్రీలీల. సాయిపల్లవి చిన్నతనం నుంచీ నాట్యంలో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా రెండు సినిమాల్లో నటించిన తర్వాత అమెరికాలో నాలుగు సంవత్సరాలు మెడిసన్‌ పూర్తి చేసిన తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌ శ్రీలీల చదువును కొనసాగిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది.

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించింది. వరస అవకాశాలు రావడంతో ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. చాలా తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ పోతినేని, నితిన్‌, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది, చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10 సినిమాల వరకు ఉన్నాయి. హీరోయిన్‌గా అంత బిజీ అయిపోయినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకుండా తనకిష్టమైన వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఈ సంవత్సరంతో ఎంబిబిఎస్‌ పూర్తవుతుందట. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అవ్వడం కోసం రెండు నెలలు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు నెలలు పూర్తిగా చదువుపై ధ్యాస పెట్టాలని శ్రీలీల భావిస్తోందని సమాచారం. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక ఆ సినిమా మేకర్స్‌ శ్రీలీల తిరిగి షూటింగ్‌కి వచ్చేవరకు వెయిట్‌ చెయ్యక తప్పదు.